Vallabhaneni Vamsi Gets Bail: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్, అయినా జైల్లోనే మాజీ ఎమ్మెల్యే
మొన్న సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో, శుక్రవారం నాడు టీాడీపీ ఆఫీసు మీద దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. కానీ ఇతర కేసుల కారణంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే విడుదల కావడం లేదు.

Vallabhaneni Vamsi Bail News Updates | విజయవాడ: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో శుభవార్త వచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వల్లభనేని వంశీ. మొన్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైంది. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వల్లభనేని వంశీకి కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి కోర్టు వంశీకి శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ కోర్టుల్లో ఊరట కలిగినా, వల్లభనేని వంశీ జైలుకు పరిమితం కానున్నారు. కానీ నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా మాజీ ఎమ్మెల్యే జైలులోనే ఉండనున్నారు. వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్లో శుక్రవారం నాడు మరో కేసు నమోదు అయింది.
వంశీకి 14 రోజుల రిమాండ్
వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడులో నకిలీపట్టాలు చేసి లబ్దిదారులకు పంచారని ఆయనపై, ఓలుపల్లి రంగా అనే వంశీ అనుచరుడిపైనా కేసు నమోదు అయింది. వీరిద్దరిని పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేసిన పోలీసులు నూజివీడు కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇద్దరు నిందితులను 14 రోజుల రిమాండ్ కు పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
అక్రమ మైనింగ్ కేసు
జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలకు సంబంధించిన వివరాలను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు అక్రమాలు చేశారని ఆ రిపోర్టులో ఉంది. దాని ప్రకారం సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో వంశీపై కేసు నమోదైంది.
వల్లభనేని వంశీకి కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నా ఊరట కలగడం లేదు. వరుస కేసులు నమోదు కావడం, మరో కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తుండటంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉండగా, వంశీపై వరుస కేసులు నమోదవుతున్నాయి. విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుల్లో ప్రవేశపెట్టడం, ఆయనకు రిమాండ్ విధించడం జరుగుతోంది. గతంలో నమోదైన కేసుల్లో బెయిల్ వస్తున్నా, ఆయన జైలు నుంచి విడుదల కావడంలో జాప్యం జరుగుతోంది. ఆయన అనారోగ్యం కారణాలతో వంశీకి బెయిల్ ఇప్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. కానీ కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ.. కొత్త కేసులు నమోదు అవుతుండటంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే మరికొంత కాలం జైల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది.






















