Vallabhaneni Vamsi: వంశీకి మరో కేసులో రిమాండ్ - కొత్త కేసు కూడా నమోదు - జైలు కష్టాలే !
Nuzvidu: వల్లభనేని వంశీ కి నకిలీ పట్టాల కేసులో నూజివీడు కోర్టు రిమాండ్ విధించింది. అంతకు ముందే పోలవరం కాల్వ గట్లను తవ్వేసిన కేసు కూడా నమోదు అయింది.

Nuzvidu court remands Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు నియోజకవర్గంలో నకిలీపట్టాలు తయారు చేసి లబ్దిదారులకు పంచారని ఆయనపై కేసు నమోదు అయింది. ఆయనతో పాటు ఓలుపల్లి రంగా అనే వంశీ అనుచరుడిపైనా కేసు నమోదు అయింది. వీరిద్దరిని పీటీ వారెంట్ పోలీసులు నూజివీడు కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ ఇవ్వాలని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇరువురు నిందితులను రిమాండ్ కు పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
పోలవరం కాల్వ గట్లను తవ్వేశారని మరో కేసు నమోదు
వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరంలో వంశీ అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.
బెయిల్ వచ్చినా బయటకు రావడం కష్టం - వరుసగా కేసులు
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయితే ఆ కేసును బలహీనం చేయాలన్న ఉద్దేశంతో ఫిర్యాదుదాడిగా ఉన్న సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా కేసు విత్ డ్రా చేయించారన్న ఆరోపమణలు వచ్చాయి. పోలీసులు ఈ కేసులో ఆయనను మూడు నెలల కిందట అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్నారు. సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో రెండు రోజుల కిందట ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన పిటిషన్ పై విచారణ ముగిసింది. తీర్పు రావాల్సి ఉంది. అందులోనూ బెయిల్ వస్తే రిలీజవ్వాలని వంశీ అనుకున్నారు.
మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోసం వంశీ ప్రయత్నాలు
కానీ ఆయనపై బాపులపాడు మండలంలో .. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు సంబంధించిన కేసులో అరెస్టు అయ్యారు. ఈ కేసులో పీటీ వారంట్ దాఖలు చేయడంతో రిమాండ్ కు వెళ్లారు. ఇప్పుడు రిలీజ్ అవ్వాలంటే.. బెయిల్ వచ్చినా సాధ్యం కాదు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ వచ్చినా... నకిలీ పట్టాల కేసులోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అందులో ఉన్నా.. ఇప్పుడు పోలవరం గట్ల తవ్వకాల కేసు పెండింగ్ లో ఉంది. మరో వైపు తన ఆరోగ్యం బాగో లేదని ఆయన చెబుతున్నారు. కోర్టుకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.





















