AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్, "ఆ నలుగురికి" అన్యాయం జరిగిందా ?
Andhra Pradesh News | ఏపీలో నామినేటెడ్ పోస్టులలో నలుగురు నేతలకు నిరాశే మిగిలింది. ఇప్పుడు జవహర్, వంగవీటి రాధా, వర్ల రామయ్య, పిఠాపురం వర్మ ల పరిస్థితి ఏంటి? అని చర్చ జరుగుతోంది.
Nominated Posts in Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ కూడా పూర్తయింది. 59 మందికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. పార్టీ కోసం దెబ్బలు తిని, కష్టాలు పడిన వారికి రెండో విడతలో మంచి స్థానమే ఇచ్చారు చంద్రబాబు. మొదటి విడతలో చోటు దక్కని పట్టాభి, Gv రెడ్డి లాంటి వారికి కూడా రెండో లిస్టులో స్థానం ఇచ్చారు. మొదటి విడత 21, రెండో విడత 59 కలిపి 80 మందికి కీలక పదవులు దక్కాయి. అయితే ఈ రెండు లిస్టుల్లోనూ స్థానం దక్కని నలుగురు కీలక వ్యక్తులు ఉన్నారు.
1) KS జవహర్, మాజీ మంత్రి
టీచర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి 2019 కు ముందు చంద్రబాబు క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు కె ఎస్ జవహర్. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత టిడిపి నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం చేసిన కొద్ది మంది లో జవహర్ ఒకరు. అధికారంలో ఉన్నప్పుడు టిడిపిలోకి వచ్చి అనుభవించిన కొందరు ముఖ్య నేతలు పార్టీ అయినప్పుడు మొఖం చేసినప్పుడు కూడా జవహర్, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య ఇలాంటి వాళ్లు పార్టీకి అండగా ఉన్నారు అని టిడిపి కార్యకర్తలు సైతం ప్రశంసించేవారు.
ఈసారి కూటమి ఏర్పాటు దృష్ట్యా జవహర్ ఇంతకు ముందు గెలిచిన కొవ్వూరు, తన స్వస్థలం తిరువూరు రెండిట్లోనూ సీటు దక్కలేదు. దానితో 2024 లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల్లో జవహర్ కు సీటు దక్కుతుందని అందరూ భావించారు. విచిత్రంగా ఆయనకు రెండు లిస్టుల్లోనూ చోటు దక్కలేదు. దీనిపై ఆయన వర్గం అసంతృప్తి కి లోనైంది. దీన్ని గుర్తించిన అధిష్టానం జవహార్ కు త్వరలో ఒక కీలక పదవి కట్టబెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
2) వర్ల రామయ్య, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు
టీడీపీని గానీ, చంద్రబాబు కుటుంబాన్ని గాని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే విరుచుకుపడే నేత వర్ల రామయ్య. ప్రస్తుతం టిడిపి పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న వర్ల రామయ్య కు పెద్ద పదవే కట్టబడతారంటూ చాలాసార్లు ప్రచారం జరిగినా రియాల్టీలో అది వర్కౌట్ కాలేదు. 2019 కు ముందు రాజ్యసభ సీట్ చేతిదాకా వచ్చి చివర్లో మిస్ అయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా వర్ల రామయ్య పేరు దాదాపు ఖరారు అయిపోయిందనుకున్న సమయంలో అనూహ్యంగా తెరపైకి కనక మేడల రవీంద్ర పేరు ఫైనల్ అయింది. అయినప్పటికీ వర్ల రామయ్య పార్టీ నే అంటిపెట్టుకొని ఉన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అప్పటి వైసిపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో రామయ్యకు మంచి పోస్ట్ దక్కుతుందని భావిస్తున్నా.. రెండు జాబితాల్లోనూ ఆయన పేరు లేదు. అయితే త్వరలోనే వర్ల రామయ్యకు చంద్రబాబు న్యాయం చేస్తారని ఆయన వర్గం నమ్మకం పెట్టుకుంది.
3) వంగవీటి రాధ
2019 కి ముందు టిడిపి ప్రభుత్వంలో జరిగిన సంచలన విషయం దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో చేరడం. అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే రకరకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది కాబట్టి వంగవీటి రాధకు మంచి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ నామినేటెడ్ పోస్టుల జాబితాల్లోనూ ఆయన పేరు లేదు. దీనితో వంగవీటి రాధా వర్గం కాస్త అసంతృప్తికి లోనైనా త్వరలోనే చంద్రబాబు ఈ విషయంపై దృష్టి పెట్టి రాధా కు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు. పైపెచ్చు వంగవీటి రాధ భవిష్యత్ కు పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. దానితో వంగవీటి రాధా కు కీలక పదవి తద్యమని ఆయన సన్నిహితులు భరోసాతో ఉన్నారు.
4) పిఠాపురం వర్మ
తను ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. ఆ సందర్భంగా వర్మ రాజకీయ భవిష్యత్తుకు తాను గ్యారెంటీ అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి వర్మ సైతం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రికార్డు మెజారిటీ కోసం మన వంతు కృషి తాను చేశారు. అయితే ఒకటి అధికారంలోకి వచ్చి ఆరో నెలలో ప్రవేశించినా ఇంతవరకు వర్మకు కీలక పదవి ఏది దక్కలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీని ఏ రూపంలో నిలపెట్టుకుంటారా అని వర్మ వర్గీయులు ఎదురుచూస్తున్నారు.
ప్రధానంగా ఈ నలుగురే కనబడుతున్నా.. కూటమి నుండి పదవులు ఆశిస్తున్న వారిలో దేవినేని ఉమ, బీద రవిచంద్ర ఇతర కీలక నేతలూ ఉన్నారు. మరి వీరి విషయంలో చంద్రబాబు ఆలోచన ఏ విధంగా ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
Also Read: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు