Dalitha Garjana: విజయవాడ దళిత గర్జనలో ఉద్రిక్తత, టీడీపీ నేతల గృహనిర్బంధం!
Dalitha Garjana: విజయవాడలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు చేపట్టిన దలిత గర్జన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి నిరాకరించారని ఎస్సీ సెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dalitha Garjana: జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ చేపట్టిన దళిత గర్జన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పలువురు ధర్నా చౌక్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు సిద్ధం అయ్యారు. ధర్నాకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చిన పోలీసులు ఇప్పుడు నిరాకరించారని, అందుకు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నామని రాజు తెలిపారు.
వాటర్ ట్యాంక్ ఎక్కిన టీడీపీ నాయకులు..
వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని మండి పడ్డారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆపై స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా దళిత గర్జనలో భాగంగా విజయవాడలో తెలుగు దేశం నేతలగృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. నేతల ఇళ్ల సమీపంలో బారికేడ్లు పెట్టిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అశోక్ బాబు, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, వర్ల రామయ్యలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
నక్కా ఆనంద్ బాబును అడ్డుకున్న పోలీసులు...
వైకాపా పాలనలో దళితులకు దక్కాల్సిన నిధులు రావడం లేదని... వారి హక్కులను హరించి వేస్తున్నారంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలో జరిగే నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులకు, ఆనంద్ బాబుకి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆనంద్ బాబు వాహనానికి పోలీసులు తమ జీపుల్ని అడ్డం పెట్టారు. ఆనంద్ బాబుని ఇంట్లో నుంచి రానీయకుండా గేట్లు కూడా వేశారు. పోలీసుల తీరుని నిరసిస్తూ... అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ తీరు, పోలీసుల ఆంక్షలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఏపీ ముఖ్య మంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏలూరి సాంబశివరావు క్యాంపు ఆఫీసు వద్ద పోలీసుల భారీ మోహరింపు..
అలాగే బాపట్ల జిల్లాలోని ఏలూరి సాంబ శివరావు క్యాంప్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. క్యాంపు ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు సురేష్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నందిగామలో టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో దళిత గర్జనకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు.