Rebel MLAs: రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై నేడు విచారణ-- హాజరయ్యేది ఎంతమంది..?
రెబల్ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. స్పీకర్ కార్యాలయం నుంచి వారికి నోటీసులను పంపింది. విచారణకు ఎమ్మెల్యేలు హాజరవుతారా.? లేదా.? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
YSRCP And TDP Rebel MLAs: రాజ్యసభ ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా పార్టీ లైన్ దాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తరువాత వారిపై ఎటువంటి చర్యలను తీసుకోలేదు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు పంపించింది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా మెలిగిన వారికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. రెండు పార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు సోమవారం స్పీకర్ కార్యాలయంలో విచారణ నిర్వహించనున్నారు. ఈ విచారణకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా..? లేదా..? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
జ్వరంతో రాలేనన్న శ్రీదేవి
స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరుకావాలా..? లేదా..? అన్న దానిపై తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులు సలహాలను తీసుకుంటున్నారు. వెళితే ఏమవుతుంది.. విచారణకు హాజరుకాకపోతే పరిస్థితి ఏమిటి అన్న దానిపైనా ఆ పార్టీ సీరియస్‌గానే ఆలోచన చేస్తోంది. సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు, మధ్యాహ్నం వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణ ఉంటుందని, ఆ మేరకు సభ్యులు హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం సమాచారాన్ని అందించింది. విచారణ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే వివరణ ఇచ్చేందుకు అనుగుణంగా స్పీకర్ కార్యాలయం 15 నిమిషాలు సమయాన్ని కేటాయించింది. విచారణకు వెళ్లేందుకు ముందు నుంచీ సంసిద్ధంగా లేని వైసీపీ ఎమ్మెల్యేలు.. నెల రోజులు గడువు కావాలని కోరారు. కానీ, స్పీకర్ కార్యాలయం దానికి అంగీకరించక విచారణను సోమవారం పెట్టింది.
ముందు నుంచీ విచారణకు గైర్హాజరయ్యే ఆలోచనలో ఉన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. ఇందుకు వివిధ కారణాలను చూపిస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాను జ్వరంతో బాధపడుతుండడం వల్ల విచారణకు రాలేనని స్పీకర్ కార్యాలయానికి సమాచారాన్ని అందించింది. మిగిలిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి విచారణకు హాజరవుతారా..? వేర్వేరు కారణాలు చూపించి దూరంగా ఉంటారా..? అన్నది చూడాల్సి ఉంది. విచారణకు వెళ్లకూడదన్న ఉద్ధేశంలోనే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెబుతున్నారు. నోటీసులు అందుకున్న వారిలో టీడీపీ, జనసేన నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరాం, వల్లభనేన వంశీ, రాపాక వరప్రసాద్, మద్దాలి గిరి ఉన్నారు.
స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో..?
వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిర్ధేశించిన సమయానికి విచారణకు హాజరుకానట్టైతే వారిపై ఎలాంటి చర్యలను స్పీకర్ తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాజ్యసభ ఎన్నికలు నాటికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఓటు హక్కును కోల్పోయేలా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే వారిపై అనర్హత వేటు వేసి.. తమకు రాజ్యసభ సీటు దక్కేలా చేసుకోవాలని అధికార పార్టీ ప్లాన్. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తమైంది. ఒకవేళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపైనా అదే విధమైన చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా న్యాయపరంగా పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కానీ, విచారణకు రెబల్ ఎమ్మెల్యేలే హాజరుకానప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా స్పీకర్ కార్యాలయం ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా సభ్యులు విచారణకు గైర్హాజరయ్యేందుకు చెప్పే కారణాలను బట్టి మరోసారి అవకాశం కల్పిస్తారని, ఆ తరువాత చర్యలకు సిఫార్సు చేసే అవకాశముందని చెబుతున్నారు. చూడాలి మరి రెబల్ ఎమ్మెల్యేలపై ఎటువంటి యాక్షన్ ఉండబోతుందో.