Krishna Collector: కలెక్టర్ దగ్గరికి కారం, కత్తి, నకిలీ తుపాకీతో వచ్చిన వ్యక్తి.. పోలీసులు షాక్!
స్పందన కార్యక్రమానికి ఓ అర్జీదారుడు డమ్మీ గన్ చాకు, కారంతో వచ్చాడు. అతణ్ని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో డమ్మీ గన్ కలకలం రేపింది. కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఈ డమ్మీ గన్‌ను భద్రతా సిబ్బంది గుర్తించారు. స్పందన కార్యక్రమానికి ఓ అర్జీదారుడు డమ్మీ గన్ చాకు, కారంతో వచ్చాడు. అతణ్ని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఆయన వద్ద ఈ ప్రమాదకర వస్తువులు గుర్తించిన భద్రతా సిబ్బంది అశోక్ అనే వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆ వ్యక్తి నుంచి డమ్మీ గన్, కత్తి, కారం పొట్లం వంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తుపాకీ పిల్లలు ఆడుకునే తుపాకీగా పోలీసులు తేల్చారు.
అశోక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చిలకలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకబాబు వెల్లడించారు. ‘‘కలెక్టర్ జె.నివాస్ సమక్షంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించేందుకు తిరువూరుకు చెందిన కె. అశోక్ చౌదరి అనే వ్యక్తి వచ్చారు. భూమికి సంబంధించిన సమస్యను కలెక్టరుకు విన్నవించుకునే సందర్భంలో తనకు కొంత సెక్యూరిటీ కావాలంటూ గన్ను, కత్తి, కారం పొడి ఆయన తనంత తానే బయటపెట్టారు. దీంతో వెంటనే తమ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తుపాకీని ఆట తుపాకీగా మేం గుర్తించాం. ఆయన ఈ వస్తువులన్నింటినీ ఎవరికైనా హాని తలపెట్టేందుకు తీసుకొచ్చాడా? అన్నదానిపై విచారణ చేస్తున్నాం. ఇవి వ్యక్తిగతంగా వాడకూడని వస్తువులు. కాబట్టి, విచారణ అనంతరం ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అతనిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో వాడే కారం, కూరగాయలు కోసుకునే కత్తినే ఆ వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ వస్తువులు ఉన్నతాధికారుల వద్దకు తీసుకురావడం ప్రమాదకరం కాబట్టి.. అతనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి చర్యలు తీసుకుంటాం.’’ అని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకబాబు వెల్లడించారు.