Chevireddy vs. Balineni : చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Andhra : అదానీ విద్యుత్ విషయంలో చెవిరెడ్డి, బాలినేని మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఇద్దరూ ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టుకుంటున్నారు.
Chevireddy and Balineni fight: ఏపీ రాజకీయాల్లో అదానీ సంస్థపై అమెరికాలో నమోదైన కేసు సంచలనంగా మారుతోంది. జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అంశంలో ఆరోపణలు వస్తూండటంతో మాజీ విద్యుత్ మంత్రి బాలినేని ..తన ప్రమేయం ఏమీ లేదని తాను సంతకం పెట్టలేదని ప్రకటించేశారు. అంతా గోప్యంగా సాగేదని ఏదో జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. బాలినేని ఆరోపణల్ని ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖండిస్తున్నారు. జగన్ ను బాలినేని మోసం చేశారని అంటున్నారు. బ్లాక్ మెయిల్ చేశారని అయినా జగన్ భరించారని అంటున్నారు.
బాలినేనిపై తీవ్ర ఆరోపణలు చేసిన చెవిరెడ్డి
సెకీతో విద్యుత్ ఒప్పందాలు బాలినేని సంతకంతోనే జరిగాయని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతిలో మీడియా సమావేశం పెట్టిన ఆయన మీరు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు, రెండు సార్లు సంతకాలు చేశారు, ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరమని బాలినేని ని ఉద్దేశించి అన్నారు. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతామన్నారు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి ఒంగోలుకు ఎలా వస్తారు అని వాసు అన్న ప్రశ్నిస్తున్నారు..మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఒంగోలు లో మీకంటే నాకు ఎక్కువ ఓట్లు వేశారని.. ఒంగోలు ప్రజలుతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. మీకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుందని.. నాయకుడు కాళ్ళు మొక్కడం తప్పు కాదు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం తప్పు కాదన్నారు. 36 ఏళ్లుగా విద్యార్థి దశ నుంచి వైఎస్ రాజారెడ్డి కుటుంబం తో మూడు తరాలుగా నేను కొనసాగుతూనే ఉన్నానని తెలిపారు. వైఎస్ జగన్ ఒంగోలుకు పంపించారు, మా శక్తి మేర అందుబాటులో వెన్నంటి ఉంటానని స్పష్టం చేశారు.
చెవిరెడ్డి అమెరికాలో ఏం చేశాడో చెబితే పరువు పోతుందన్న బాలినేని
చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక చోటా నాయకుడని బాలినేని మండిపడ్డారు. జగన్ కాళ్ళు పట్టుకున్న వ్యక్తి చెవిరెడ్డి అని..మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకుండా చెవిరెడ్డికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం చెవిరెడ్డి మాదిరి భజన చేయలేదనే ఆయనకు సీట్ ఇవ్వలేదన్నారు. ఎక్కడో చిత్తూరు నుంచి చెవిరెడ్డి ని తెచ్చి మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
చెవిరెడ్డి నన్ను కామెంట్ చేసేంతటి వాడా ? నేను జగన్ పార్టీ పెట్టినప్పుడు నేను మంత్రి పదవి వదిలి వచ్చి పార్టీలో చేరానని.. చెవిరెడ్డి అమెరికా వెళ్లి ఏమి చేస్తున్నాడో నేను గుట్టు విప్పితే పరువు పోతుందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై నేను సంతకం పెట్టలేదు కేవలం కేబినెట్ కి మాత్రమే పంపాననని.. అదాని ఒప్పందం కేబినెట్ తీసుకున్న నిర్ణయమన్నారు. నేను ఒక్కరూపాయి కూడా ముడుపులు తీసుకోలేదు .. చెవిరెడ్డికి దమ్ముంటే పబ్లిక్ చర్చకు రావాలని సవాల్ చేశారు.
విద్యుత్ మంత్రిగా చేసిన బాలినేని ఆరోపణలతో వైసీపీకి ఇరకాటం
అదానీ,సెకీ విద్యుత్ ఒప్పందం జరిగినప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలతో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.అసలు అదానీతో ఒప్పందమే లేదని వాదిస్తున్న సమయంలో తనను అర్థరాత్రి లేపి సంతకం పెట్టమన్నారని..తనకు ఏ విషయం చెప్పలేదని ఆయన చేస్తున్న ఆరోపణతో డ్యామేజ్ జరుగుతోందని.. కౌంటర్ గా చెవిరెడ్డిని రంగంలోకి దింపారని భావిస్తున్నారు.