Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Telangana News | తెలంగాణలోని యంగ్ స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అదానీ డబ్బులు తెలంగాణకు వద్దన్నారు.
Telangana CM Revanth Reddy clarifies that govt rejected Rs 100 crore from Adani Group : హైదరాబాద్: వ్యాపారవేత్త గౌతం అదానీకి తెలంగాణ ప్రాజెక్టులు కట్టబెడుతుందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చెప్పిన సూచన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు టెండర్లలో ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతే కానీ అదానీకి టెండర్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ సంస్థ ఇస్తామన్న డబ్బులను తాము నిరాకరించామని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎస్ఆర్ కింద అదానీ గ్రూప్ రూ.100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తామని చెప్పగా, అదానీ డబ్బు తెలంగాణ ప్రభుత్వానికి వద్దు అని అదానీ ( అదాని ఫౌండేషన్ ఛైర్మెన్) కి అధికారి జయేష్ రంజన్ లేఖ సైతం రాసినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్లు ఆఫర్ చేయడం తెలిసిందే. నిన్ననే లేఖ రాశామని చెప్పిన రేవంత్ రెడ్డి, తాజా ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. కేసుల మాఫీ కోసం, పైరవీల కోసం ఢిల్లీ వెళ్లే రకం తాము కాదన్నారు. అదానీతో వివాదానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీ పర్యటనపై వార్తలపై రేవంత్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 26వసారి ఢిల్లీకి వెళ్తున్నారని, 27వ సారి వెళ్తున్నాని మీడియాలో, సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు వెళ్తున్నారని.. ఢిల్లీకి వెళ్లే ప్రతిసారి ప్రచారం జరుగుతోందన్నారు. తాజాగా వెళ్తున్న ఢిల్లీ పర్యటనతో రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావడానికి ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. గతంలోనూ పలు రాజకీయేతర కార్యక్రమాలకు హాజరు కావడానికి ఢిల్లీకి వెళ్లానన్నారు. అంతేకానీ తాను కేసుల మాఫీ కోసమో, ఎవరితోనో పైరవీ కోసమే ఢిల్లీకి వెళ్లడం లేదంటూ బీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేశారు.
తెలంగాణకు అదానీని ఆహ్వానించింది బీఆర్ఎస్
అదానీని తెలంగాణకు ఆహ్వానించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో పలు ప్రాజెక్టులను అదానీ గ్రూపునకు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. అదానీతో కేసీఆర్ దిగిన ఓ ఫొటోను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు చూపిస్తూ.. వంగి వంగి దండాలు పెడుతున్న వ్యక్తి మీకు తెలుసా అని అడిగారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ఎన్నిసార్లయిన ఢిల్లీకి వెళ్తానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రానికి నిధులు తేలేదంటారు, ఢిల్లీ పర్యటనకు వెళ్తే దుష్ప్రచారం చేయడం బీఆర్ఎస్ నైజం అన్నారు.