కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు ఆయనే - జగన్‌కు జీవితాంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి
విజయవాడలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి.
ఎన్టీఆర్ వారసులం అంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారని, కేవలం కడుపున పుట్టినంత మాత్రాన వారసులు కాబోరని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు అని అన్నారు. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉన్నది దేవినేని నెహ్రూ మాత్రమే అని, దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు అని మాట్లాడారు. విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, కొడాలి నాని, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి తాను అలసిపోయానని, తన ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదని అన్నారు. మాట్లాడటం కూడా రాని నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ కి తానే వారసుడినంటున్నాడని అన్నారు. ఎన్టీఆర్‌ను ఈ దుర్మార్గులు మోసం చేశారని, అలాంటివారు ఎలా వారసులు అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని, ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడని అన్నారు. ఎన్టీఆర్ పేరు కానీ, ఫొటో కానీ పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు అని లక్ష్మీపార్వతి మాట్లాడారు.
కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ తనకు ధైర్యాన్ని ఇచ్చారని, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తన పాత్ర గురించి అందరికీ తెలియజెప్పారని అన్నారు. తన క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు తనకు పోసాని కృష్ణ మురళి ఓ సోదరుడిగా అండగా నిలిచారని అన్నారు.
గుణం లేని వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పాలి - పోసాని క్రిష్ణ మురళి
పోసాని క్రిష్ణ మురళి మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలని పోసాని అన్నారు. ఎన్టీఆర్ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. లక్ష్మీ పార్వతి మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోందని అన్నారు. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుందని చెప్పారు. కానీ వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత, ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడని ఆరోపించారు. రామారావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.