YSRCP Politics: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలు నెరవేర్చింది: మాజీ మంత్రి పార్థసారథి
YSRCP MLA Kolusu Parthasarathy: టీడీపీ అధినేత చంద్రబాబుది విభజించు పాలన, సీఎం జగన్ ది ప్రజా పాలన అని పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
సామాజిక - ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. మానవ వనరుల అభివృద్ది జరగడం వల్ల రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని నమ్మిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ లక్ష్యంలో తేడా ఉందని దానిని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు.
99.5 శాతం హామీలు నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వం
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 99.5 శాతం వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని పార్థసారథి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంటే అల్లర్లు, వర్గ విభేదాలు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు పబ్బం గడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తుందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా విద్యా రంగానికి 30 వేల కోట్ల రూపాయలు కేటాయించి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ ను పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం అని తెలిపారు. కేవలం అర్హత ఆధారంగా పథకాలు అందిస్తూ సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని.. కొన్నిచిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షం చేస్తోన్న క్షుద్ర రాజకీయాలను ప్రజలు నమ్మవద్దని ఆయన హితవు పలికారు.
లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ పథకాలు
గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం ‘విదేశీ విద్యా దీవెన’ ద్వారా 213 మంది విద్యార్థులకు 19.95 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిందని పేర్కొన్నారు. కుల, మత బేధాలు లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది విభజించి పాలించు వైఖరని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతిని ప్రోత్సాహించారని అన్నారు. కానీ దానికి భిన్నంగా టీడీపీకి నాయకుని కూతురుకి విదేశీ విద్యాదీవెన కింద 84 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించనున్నట్లు చెప్పారు. మొదటి విడత కింద వారి అకౌంట్ లో రూ.13,99,154 జమ చేసిందని తెలిపారు.
'జగనన్న విద్యా కానుక' కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ మూడు జతల యూనిఫారాలు, నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్‌లను అందజేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని వెల్లడించారు. కేవలం ఉపాధ్యాయులకు జీతాలు తప్పా పాఠశాలల ఆధుణీకరణకు ఏమి చేసేవారు కాదని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. స్వయానా విద్యాశాఖ మంత్రిగా చేసిన తనకు నేటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే గర్వంగా ఉందని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు. నేటి తరం విద్యార్థి, యువత భవిష్యత్తుకు సీఎం జగన్ బంగారు బాటలు వేయిస్తున్నారని కొనియాడారు. విద్యా కానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. ఇందుకోసం గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.2368.33 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల మధ్య అంతరం తగ్గిందని దానికి నిదర్శనమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల 61-72 శాతానికి హాజరు శాతం పెరిగింది వివరించారు. ట్యాబ్‌ల పంపిణీ, ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలను అమర్చి డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రతిపక్ష టీడీపీలో ఎవరైనా ఇలాంటివి ఆలోచించగలరా అని ఆయన ప్రశ్నించారు.
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ దేశాల నిపుణులు ప్రశంసిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు. నాడు - నేడు పేరును PM SHRI (PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా)గా మార్చారని ఆయన చెప్పారు. టీడీపీ హయాంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు గ్రేడింగ్ ప్రకారం దేశంలో 24వ ర్యాంక్‌లో ఉండేదని నేడు 7వ స్థానంలో కొనసాగుతుందని మాజీ మంత్రి పార్థసారథి వివరించారు.