Vijayawada: భారీ వర్షానికి విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు- ఒకరు మృతి, పలువురికి గాయాలు
Heavy Rain In Vijayawada: విజయవాడలో రాత్రి నుంచి పడుతున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. ఈ వాన కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. పలువురికి గాయాలు అయ్యాయి.
![Vijayawada: భారీ వర్షానికి విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు- ఒకరు మృతి, పలువురికి గాయాలు few people were injured in a Landslide caused by heavy rains in Vijayawada Vijayawada: భారీ వర్షానికి విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు- ఒకరు మృతి, పలువురికి గాయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/31/a3c826b2575df4d53b3bc4c39c688a861725079029348215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh Weather: భారీ వర్షాలతో విజయవాడ ఒక్కసారిగా వణికిపోయింది. కుంభవృష్టితో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. కొండచరియలు సమీపంలోని ఇళ్లపై విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండచరియల ధాటికి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమో అన్న అనుమానంతో యుద్ధ ప్రాతిపదికన శిథిలాలను అధికారులు తొలగిస్తున్నారు.
మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ఈ కొండ చరియలు విరిగిపడిన ఘటన జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొండ చరియలు విరిగిపడినట్టు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ ళ్లు పూర్తిగా ధ్వంసమైంది. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహయాక చర్యలు చేపట్టాయి. ధ్వంసమైన ఇళ్ల శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ వాటిని జాగ్రత్తగా పనులు చేస్తున్నారు.
అధికారులు అప్రమత్తం
విజయవాడలో రాత్రి నుంచి పడుతున్న వర్షంపై అధికారులను అలెర్ట్ చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో ఫోన్‌లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు,రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీలలో నీరు పారుదలకు ఆటంకాలు లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.
వర్షాలపై చంద్రబాబు సమీక్ష
విజయవాడ సహా రాష్ట్రంలో వివిద జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సమస్యలు రానీయొద్దు: గొట్టిపాటి రవి
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న వేళ విద్యుత్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రజలకు సమస్యల్లేకుండా చూడాలన్నారు. ప్రమాదంల నివారణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని హితవుపలికారు.
భారీ వర్షాలు కురుస్తున్న వేళ రైతులు, ఇతర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రవి సూచించారు. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. విద్యుత్ తీగలు తెగిపడిన, కిందకు జారిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వాటిని తాకడం, పక్కకు నెట్టడం లాంటి పనులు చేయవద్దని హితవు పలికారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఆలస్యం లేకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రవి.
Also Read: వైజాగ్ నుంచి తిరుపతి, శబరిమల, చెన్నై, సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్స్- టైమింగ్స్ ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)