Divis Murali: వరద బాధితులకు దివిస్ మురళీ భారీ సాయం, 5 రోజులు భోజనం అందజేత
Heavy Rains : వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు దివిస్ అధినేత మురళీ కృష్ణ భారీ విరాళాన్ని అందించారు. ఐదు రోజులపాటు బాధితులకు ఆహారాన్ని అందించే ఏర్పాట్లను చేశారు. రూ.2.50 కోట్ల సాయాన్ని అందించారు.
Heavy Rains in Vijayawada: తీవ్రమైన వరదలతో అల్లాడుతున్న విజయవాడ వాసులకు అండగా ఉండేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు స్వచ్చంధ సంస్థలు బాధితులకు అండగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బాధితులకు పళ్లు, పాలు, ఆహార పదార్థాలను అందిస్తుండగా, ప్రభుత్వం కూడా సహాయ చర్యలకు వేగవంతం చేసింది. ఇప్పటికీ విజయవాడలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఆపన్న హస్తం అందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, దివిస్ సంస్థ ఎండీ మురళీ కృష్ణ ముందుకు వచ్చారు.
2.50 కోట్ల రూపాయలు వ్యయంతో ఆహారం తయారీ
వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించేందుకు ఆయన భారీ విరాళాన్ని అందించారు. అక్షయ పాత్ర ద్వారా రోజుకు 1.70 లక్షల మందికి ఆహారం అందించాలని నిర్ణయించారు. ఐదు రోజులపాటు ఇలా ఆహార పదార్థాలను బాధిత ప్రజలకు అందించనున్నట్టు మురళీకృష్ణ వెల్లడించారు. ఇందుకోసం రూ.2.50 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ సాయం కొనసాగనుంది. ఇందుకోసం అక్షయ పాత్ర సంస్థ సిద్ధమైంది. దివిస్ మురళీ పిలుపుతో ఒకేరోజు మూడు లక్షల మందికి ఆహారం తయారు చేసి అక్షయ పాత్ర సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది.
ఒకేరోజు 3 లక్షల మందికి ఆహారం తయారు
విజయవాడ ప్రజలను ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేయాలని సీఎం చంద్రబాబు అక్షయ పాత్ర ప్రతినిధులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సదరు సంస్థ సోమవారం సుమారు మూడు లక్షల మందికి ఆహారాన్ని తయారు చేసి ప్యాకెట్లు రూపంలో బాధితులకు అందించింది. అక్షయపాత్ర సంస్థ సర్వీసులోనే ఈ స్థాయిలో ఆహార పదార్థాలను తయారు చేయడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. దివిస్ మురళీ అందించిన సాయంతో మరో నాలుగు రోజులపాటు బాధితులకు ఆహార పదార్థాలను భారీ ఎత్తున సిద్ధం చేసి బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు.
పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
ముంపునకు గురైన అనేక ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) సోమవారం పర్యటించారు. వాహనం వెళ్లగలిగినంత దూరం వాహనంలో ప్రయాణించిన ఆయన.. ఆ తరువాత కాలినడకన అనేక ప్రాంతాలకు వెళ్లారు. కొన్ని చోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదులు పరిష్కారానికి స్వయంగా మాట్లాడి కష్టాలు వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం మరోసారి సమీక్ష నిర్వహించారు. సహాయ చర్యల్లో వేగం పెంచి ప్రజలకు భరోసా ఇచ్చినట్టు తెలిపారు. ఊహించని విపత్తు నుంచి ప్రజలను త్వరగా కాపాడాలని అధికారులను ఆదేశించారు.