Boppana To Join TDP: నారా లోకేశ్‌ను కలిసిన బొప్పన- పార్థసారథితో పాటు ఈ 21న టీడీపీలో చేరతానని స్పష్టత!
Boppana BhavaKumar meets Nara Lokesh: విజయవాడ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడ సిటీ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.
Vijayawada TDP News: విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్తుంటే, ప్రధాని ప్రతిపక్ష పార్టీ నుంచి వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ సిటీ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)ను కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వైసీపీ నేత బొప్పన వెళ్లారు. తాను వైసీపీని వీడి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు బొప్పన భవకుమార్ (Boppana BhavaKumar) స్పష్టం చేశారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్న బొప్పన ఇప్పటికే కేశినేని చిన్ని, వంగవీటి రాధా, గద్దె రామ్మోహన్ తదితర నేతలతో చర్చలు జరిపారు.
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధితో పాటు తానూ ఈ నెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన తనతో పాటు జలీల్ ఖాన్, పార్థసారధి, సామినేని ఉదయ భానులకు గౌరవం లేదని బొప్పన భవకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నేతలు ఒక్కొక్కరూ పార్టీ వీడుతున్నారని.. ఉదయ భాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ వైసీపీలో ఎవ్వరూ ఇమడలేని పరిస్థితి నెలకొందన్నారు.
విజయవాడ వైసీపీలో పెత్తనం మొత్తం ఒక్కడి చేతిలోకి పోయిందన్నారు. ఎవ్వడి సొంత నిర్ణయాలు వాడివి తప్పితే పార్టీలో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, నేతలకు గౌరవం లేదని ఆరోపించారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తన వంతు సహాయం చేస్తానన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయటానికి వైసీపీని వీడటం లేదని బొప్పన పేర్కొన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి టీడీపీలో చేరడం లేదని బొప్పన స్పష్టం చేశారు.
దేవినేని అవినాష్ సహా తదితర నేతలు బొప్పనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని, అలాంటి చోట తాను ఉండలేనని తేల్చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన భవ కుమార్.. గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి చెందారు.
తన ప్రాంతం అమరావతి, విజయవాడ అభివృద్ధి కోసం బొప్పన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని కేశినేని చిన్ని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలో బొప్పనను పోటీ చేయించారని పేర్కొన్నారు. ఏ పదవులు, సీట్లు ఆశించకుండా బొప్పన టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. షర్మిల ఏపీలో రాజకీయాలు మొదలుపెడితే వైసీపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి పార్టీలు అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీని వీడి తమ పార్టీలో చేరతారని చెప్పుకొచ్చారు.