(Source: Poll of Polls)
AP CID Petition: చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్, రేపు విచారించే ఛాన్స్!
AP CID petition seeking custody of Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
AP CID petition seeking custody of Chandrababu :
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడీ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్ 11న) విచారణ జరిగే అవకాశముంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు రెండు పిటిషన్లు!
విజయవాడ ఏసీబీ కోర్టు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రెండు వారాల రిమాండ్ విధించడం తెలిసిందే. అయితే చంద్రబాబును గృహ నిర్బంధంలో ఉంచేలా చూడాలని ఆయన తరఫు లాయర్లు ప్రయత్నిస్తున్నారు. జ్యుడీషియల్ రిమాండ్ ను గృహ నిర్బంధంగా మార్చేలా చూడాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దాంతో పాటు వయసురీత్యా తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటి భోజనం, ప్రత్యేక ఏర్పాట్లకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ వేయనున్నారు చంద్రబాబు తరపు లాయర్లు.
చంద్రబాబు వయస్సు, హోదా దృష్ట్యా టీడీపీ అధినేతను గృహ నిర్బంధంలో ఉంచాలని న్యాయవాదులు కోర్టును కోరారు. కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్‍ను హౌస్ అరెస్టుగా పరిగణించాలని కోరారు. హౌస్ అరెస్టుకు కోర్టు అంగీకరించని పక్షంలో.. ఒకవేళ రాజమండ్రి జైలుకు తరలిస్తే ఆయనకు ఇంటి భోజనం, స్పెషల్ మెడిసిన్ లాంటి ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఏపీలో 144 సెక్షన్..
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ప్రతికూల తీర్పు రావడంతో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు వచ్చాయి. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు.