Vijayawada Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్ - డబుల్ డెక్కర్ సహా ఈ రైళ్లు రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు
Vijayawada Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భద్రతా పరమైన పనుల కారణంగా అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైలు ప్రయాణికులకు అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయ్యాయి. డివిజన్ పరిధిలోని భద్రతా పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో ప్యాసింజర్ ట్రైన్ సహా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ఉన్నాయి. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాజమండ్రి - విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ రైలును (07466), ఆయా తేదీల్లో తిరుగు ప్రయాణం అయ్యే రైలు (07467)ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు గమనించాలని సూచించారు.
డబుల్ డెక్కర్ కూడా
విశాఖ - విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడిచే డబుల్ డెక్కర్ (22701) రైలును అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణమయ్యే రైలు కూడా ఆయా తేదీల్లో అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. వీటితో పాటు 26, 27, 28 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. విశాఖ - కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కొరాపుట్ నుంచి తిరిగి ప్రయాణం అవుతుందని, అలాగే హౌరా - జగ్దల్ పూర్ సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ టిట్లాగఢ్ నుంచి హౌరాకు తిరుగు ప్రయాణమవుతుందని వివరించారు. భువనేశ్వర్ - జగ్దల్ పూర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ (18447) కొరాపుట్ నుంచి తిరుగు ప్రయాణమై భువనేశ్వర్ చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
రోడ్ కం రైలు వంతెన 2 వారాలు క్లోజ్
మరోవైపు, రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జి మూసివేతను మరో 2 వారాలు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. గత నెల 27 నుంచి వంతెనపై ట్రాఫిక్ నిలిపేసి సుమారు రూ.2 కోట్ల నిధులతో మరమ్మతులు చేపడుతున్నారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో నవంబర్ 10 వరకూ బ్రిడ్జిపై రాకపోకలు నిషేధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తొలుత అక్టోబర్ 26 (గురువారం) వరకూ రాకపోకలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, గడువు ముగిసిన నేపథ్యంలో పనులు పూర్తి కానందున మరో 2 వారాలు గడువు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
ప్రజల ఇబ్బందులు
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొవ్వూరు వైపు నుంచి రాజమండ్రికి రావడానికి ఇదే ప్రధాన ప్రవేశ మార్గం. విద్యార్థులు కాలేజీలకు వెళ్లేందుకు సైతం ఇదే చాలా దగ్గరి మార్గం. మరమ్మతుల కారణంగా ఈ వంతెన మూసేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా లేదా ఇటువైపు గామన్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. తీవ్ర ఇబ్బందులు పడుతూ చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. త్వరగా వంతెన మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - 12 మంది ఏపీ వాసులు మృతి, కూలీ పనులకు వెళ్తూ మృత్యుఒడికి!