Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - 12 మంది ఏపీ వాసులు మృతి, కూలీ పనులకు వెళ్తూ మృత్యుఒడికి!
Karnataka Accident: కర్ణాటకలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా సుమో వాహనం ఢీకొట్టిన ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులంతా ఏపీ వాసులే
మృతులంతా ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వీరు కూలీ పనుల కోసం బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
పొగమంచే ప్రాణం తీసిందా
దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగుళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున తీవ్ర పొగమంచు కారణంగా డ్రైవర్ నరసింహులు, రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ ను గమనించకుండా ఢీకొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు వీరే
ప్రమాదంలో మృతులు అరుణ, నంజుండప్ప, నవీన్ కుమార్, పద్మావతి, వెంకటసుబ్బమ్మ, నారాయణగా పోలీసులు గుర్తించారు. మృతులంతా బెంగుళూరులోనే హోంగసంద్ర ప్రాంతంలోనే నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో నారాయణ, వెంకటసుబ్బమ్మ దంపతులని తెలిపారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
కర్ణాటక ప్రమాదంలో ఏపీ వాసులు మృతి చెందడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'చిక్ బళ్లాపూర్ వద్ద ప్రమాదంలో సత్యసాయి జిల్లా వాసులు మృతి చెందడం ఎంతో కలిచివేసింది. మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం' అని సీఎం ట్వీట్ చేశారు.
కర్ణాటకలోని చిక్‌బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2023
విశాఖలోనూ ప్రమాదం
విశాఖలో బుధవారం అర్ధరాత్రి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై ప్రమాదం సంభవించింది. ఓ బైక్ డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.