AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ
AP Govt Employees Union : బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
AP Govt Employees Union : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజయవాడలో చర్చా వేదిక నిర్వహించింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని డిమాండ్ చేసింది. జీతాల చెల్లింపుల విషయంలో చట్టం చేయాలనే డిమాండుపై అన్ని పార్టీలకు వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించింది. పార్టీలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలవాలని చర్చా వేదికలో తీర్మానం చేశారు.
రూ.10-12 వేల కోట్ల బకాయిలు!
"ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు తమకు రావాల్సినటు వంటి బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, చెల్లింపులు నిబంధనల మేరకు జరగడంలేదు. జీతభత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు నిర్థిష్ట కాలపరిమితి మేరకు చెల్లించాలని నిబంధనలు ఉన్నా ఇటీవల కాలంలో చెల్లింపులు సరిగ్గా జరగడంలేదు. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం తాము దాచుకున్న సీపీఎస్ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.10-12 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత మార్చి 2022 నుంచి సీపీఎస్ బకాయిలు చెల్లించడంలేదు. ప్రభుత్వం తమ మానస పుత్రిక అని తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రెండేళ్ల కాలపరిమితి ముగియగానే ప్రొబెషన్ డిక్లైర్ చేసి రెగ్యులర్ వేతనాలు ఇస్తామని ప్రకటించారు. అడ్మినిస్ట్రేషన్ సాకులతో తొమ్మిది నెలల పాటు ఉద్యోగులకు వేతన పరిమితి చెల్లించకపోవడం సరికాదు. 2024 ఫిబ్రవరి నుంచి పదవీ వివరణ ప్రక్రియ మొదలవుతుంది. వాళ్లకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ఒక నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఇబ్బందులు పడకుండా ఒక చట్టాన్ని తీసుకురమ్మని ప్రభుత్వం కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వచ్చే ఆదాయంలో మొదటి చెల్లింపుదారులుగా ఉద్యోగులు, పెన్షనర్లను నిర్ణయించాలని గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించాం. గవర్నర్ ను కలిస్తే క్రమశిక్షణ ఉల్లంఘన అని కొంత మంది ఆరోపించారు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెబుతున్నాం. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, అధికారులు, ఇతర సంఘాలపై మేం వ్యాఖ్యలు చేయలేదు. ఉద్యోగుల్లో భరోసా కల్పించాలని కోరుతూ గవర్నర్ ను కలిశాం." - ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
చట్టంతో ఉద్యోగుల్లో భరోసా
"మేం చట్టం చేయమని చెప్పిన అంశం ఏం తప్పుకాదు. ప్రభుత్వ ఉద్యోగులు, శాసనసభ్యులు, జడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధుల జీతభత్యాలపై 1953లో చేసిన చట్టం చేశారు. సంవత్సరానికి రూ.72 వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర చెల్లింపులకు అవసరం ఉంటుంది. చెల్లింపుల్లో పెండింగ్ కారణంగా ఇప్పటికే రూ.10 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బాకీపడింది. ప్రతీ ఆరు నెలలకు ఒక డీఏ చెల్లింపు ఉండడంతో వాటి తాలూకు చెల్లింపులు పేరుకుపోతాయి. వచ్చే ఏడాది నుంచి కొత్త స్కేలు అమలుచేయాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులపై ప్రభుత్వం ఒక చట్టం చేయాలని కోరుతున్నాం. చట్టం చేస్తే ఉద్యోగుల్లో భరోసా ఉంటుంది. బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలని కోరుతున్నాం. అందుకోసం అవసరమైతే రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందిస్తాం. "- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ