TTD Board Meeting: ఎల్లుండి టీటీడీ బోర్డు సమావేశం.. కీలక విషయాలపై చర్చ..!
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సమావేశం ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు ప్రమాణస్వీకారం చేశారు.
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సమావేశం ఈనెల 6వ తేదీన తిరుమల అన్నమయ్య భవనంలో జరగనున్నట్టు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. 24 మంది సభ్యులతోపాటు ఈవో, తుడా ఛైర్మన్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లను ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రకటించారు. ఈ మేరకు సభ్యులందరూ దాదాపుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 7వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో నిర్వహణ, ఏర్పాట్లు తదితరాలపై ముందు రోజే సభ్యులు సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఉత్సవాలు జరగనున్నాయి.
- 06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు)
- 07-10-2021: ధ్వజారోహణం(ఉదయం)- పెద్దశేష వాహనసేవ(సాయంత్రం)
- 08-10-2021: చిన్నశేష వాహనసేవ(ఉదయం)- హంస వాహనసేవ(సాయంత్రం)
- 09-10-2021: సింహ వాహనసేవ(ఉదయం)- ముత్యపుపందిరి వాహనసేవ(సాయంత్రం)
- 10-10-2021: కల్పవృక్ష వాహనసేవ(ఉదయం)-సర్వభూపాల వాహనసేవ(సాయంత్రం)
- 11-10-2021: మోహినీ అవతారం(ఉదయం)- గరుడ వాహనసేవ(సాయంత్రం)
- 12-10-2021: హనుమంత వాహనసేవ(ఉదయం)- గజ వాహనసేవ(సాయంత్రం)
- 13-10-2021: సూర్యప్రభ వాహనసేవ(ఉదయం)- చంద్రప్రభ వాహనసేవ(సాయంత్రం)
- 14-10-2021: రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనసేవ(ఉదయం)- అశ్వ వాహనసేవ(సాయంత్రం)
- 15-10-2021: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. కరోనా రెండు డోసుల టీకా, 72 గంటల ముందు పరీక్షించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులతో పాటు ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టికెట్లు ఉంటేనే.. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అనుమతి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు, తితిదే సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తితిదే నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.