Today Headlines: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ - తెలంగాణ సీఎం రేవంత్ దావోస్ పర్యటన, సాయంత్రం మకర జ్యోతి దర్శనం
Head Lines: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ, సినిమా, స్పోర్ట్స్ కు సంబంధించిన నేటి ముఖ్య వార్తలు ఇక్కడ చదివేయండి.
Top Headlines on 15th January:
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి ముగ్గులు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు, కొత్త అల్లుళ్ల సరదాలతో పల్లెలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన వారు పల్లెలకు చేరుకోగా.. కుటుంబాలతో కలిసి సందడిగా పండుగను చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఇల్లు చూసినా ఇంటి ముందు రంగ వల్లులలతో కళకళలాడుతున్నాయి.
జోరుగా కోడి పందేలు
సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు జోరందకున్నాయి. హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ పలు చోట్ల పందేలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు రూ.కోట్ల వరకూ చేతులు మారినట్లు తెలుస్తోంది. వీటిని స్థానిక ప్రజా ప్రతినిధులే దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఉమ్మడి ప.గో జిల్లాలోని గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి. తూ.గో జిల్లా గోపాలపురంలో పందెం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారి తీయగా.. పోలీసులు జోక్యం చేసుకుని పందేలను అడ్డుకున్నారు.
విశాఖలో విమానాల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
ప్రతికూల వాతావరణంతో విశాఖలో పలు విమానాల సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విశాఖ నుంచి ఢిల్లీ ఇండిగో, ఢిల్లీ ఎయిర్ ఇండియా, విజయవాడ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు విశాఖకు వెళ్లేవి.. విశాఖ నుంచి వెళ్లే పలు సర్వీసులు రద్దయ్యాయి. దాంతో విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇండిగో సంస్థ సిబ్బందితో కొందరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
తెలంగాణ సీఎం రేవంత్ దావోస్ పర్యటన
సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ (Davos)లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' (World Economic Forum) 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని తెలంగాణ అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
సంక్రాంతి ఎఫెక్ట్.. నగరం ఖాళీ
సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్య నగరం ఖాళీ అయింది. చాలా మంది సొంతూళ్లకు పయనం కావడంతో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రజలు తరలివెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అటు, ప్రధాన స్టేషన్లన్నీ రద్దీగా మారాయి. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందని ఎండీ సజ్జనార్ తెలిపారు. తొలిసారిగా బస్ భవన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామన్నారు.
నేడు మకర జ్యోతి దర్శనం
శబరిమలలో సోమవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా అయ్యప్ప సన్నిధానానికి తరలివస్తున్నారు. శబరి గిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఉంటుందని ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేక వ్యూ పాయింట్స్ సిద్ధం చేసింది. కాగా, జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. అయితే, జ్యోతి దర్శనాన్ని 4 లక్షల మంది వీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు.
నేడు పీఎం జన్ మన్ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం జన్ మన్ పథకం సోమవారం ప్రారంభం కానుంది. పీఎం మోదీ గిరిజనులతో వర్చువల్ గా మాట్లాడనున్నారు. అరుకు లోయ మండలం కొత్తబల్లుగుడ గ్రామంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం, సంక్షేమం వంటివి లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
భారత్ న్యాయ్ జోడో యాత్ర ప్రారంభం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం నుంచి 'భారత్ న్యాయ్ జోడో యాత్ర'ను ప్రారంభించారు. మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలో ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి ఈ యాత్ర మొదలు పెట్టారు. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత్ న్యాయ్ యాత్ర 100 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. మొత్తంగా 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది.
సిరీస్ కైవసం చేసుకున్న భారత్
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్, శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్‌తో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 26 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్, శివమ్ దూబే అర్థ శతకాలతో భారత్‌కు విజయాన్ని అందించారు.
'ది రాజా సాబ్'గా ప్రభాస్
ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌లో కూడా ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుంది. సంక్రాంతి సందర్భంగా సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ గత చిత్రాల్లా పవర్‌ఫుల్‌గా కాకుండా బాగా కూల్‌గా, కొత్తగా, కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమా ఒక హార్రర్ కామెడీగా తెరకెక్కనున్నట్లు సమాచారం.