Bhumana Karunakar: సమాజంలో అలజడి రేగే అవకాశం - ఉదయనిధి వ్యాఖ్యల్ని ఖండించిన టీటీడీ ఛైర్మన్
సనాతన ధర్మ ప్రచారం విస్తృతంగా జరగాలని, యువతలో హైందవ భక్తి పెంపొందించేందుకు చేపట్టే కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తామని భూమన అన్నారు.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. మంగళవారం (సెప్టెంబరు 5) తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షణ చేత జరిగిన పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా సనాతన హిందూ ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవనమని ఆయన చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని కరుణాకర రెడ్డి హెచ్చరించారు.
సనాతన ధర్మ ప్రచారం విస్తృతంగా జరగాలని, యువతలో హైందవ భక్తి పెంపొందించేందుకు చేపట్టే కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తాంమన్నారు. 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతి, యువతులకు రామకోటి తరహలో గోవింద కోటిని వ్రాయిస్తామని, దీని ద్వారా యువతలో ముఖ్యంగా హైందవ ధర్మం పెంపొందే అవకాశం ఉందన్నారు. ఇలా గోవింద కోటిని వ్రాసిన వారి కుటుంబ సభ్యులకు విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. 10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు వ్రాసిన వారికి దర్శనభాగ్యం కల్పిస్తామని, అదే విధంగా ఏపీలో ఎల్.కే.జీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్దులకు భగవద్గీత సారాంశంను అందించడంతో పాటుగా, గోవిందనామ కోటి పుస్తకాలు పంపిణి చేస్తామని ఆయన తెలియజేశారు.
సెప్టెంబరు 18 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఇక సెప్టెంబరు 18వ తేదీ నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని, ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను తిరుమలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటాంమని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలను రద్దూ చేయడం జరిగిందని, ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ఏపి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏపి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాంమని తెలిపారు.
టీటీడీ 2024 సంవత్సరంకు సంబంధించిన డైరీలు, క్యాలండర్ లను ఏపి సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ముంబయిలోని బాంద్రాలో 5.35 కోట్లతో టీటీడీ సమాచార కేంద్రాన్ని, 1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నామని, ఇక 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనులకు నిధులు కేటాయించడంతో పాటుగా, టీటీడీ పోటులో పెండింగ్ లో ఉన్న 413 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.
2.46 కోట్లతో టీటీడీ ఆసుపత్రులకు మందులు కోనుగోలుకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, టీటీడీ ఆధ్వర్యంలోని వేద పాఠశాలలో 47 అధ్యాపకుల పోస్టుల భర్తికి చేసేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల వద్ద అభివృద్ది పనులకు 33 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని, తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ది పనులుకు 4.15 కోట్ల రూపాయలు కేటాయించాంమన్నారు. తిరుపతిలోని పురాతనమైన 2, 3 సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో అచ్యుతం, శ్రీపఠం వసతి సముదాయాలను నిర్మించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.