Tirupati News: మోహన్ బాబు అనుచరులు మా హత్యకు కుట్ర చేశారు - ఎంపీటీసీ, ఉపసర్పంచ్ ఆరోపణలు
రుపతి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న ఎంపీటీసీ సభ్యుడు బోస్ చంద్రారెడ్డిని హత మార్చేందుకు ఆరుగురు దుండగులు విఫలయత్నం చేశారని బాధితులు ఆరోపణ చేశారు.
నటుడు మోహన్ బాబు అనుచరులు తమ హత్యకు కుట్ర చేశారని చంద్రగిరి మండలం, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న ఎంపీటీసీ సభ్యుడు బోస్ చంద్రారెడ్డిని హత మార్చేందుకు ఆరుగురు దుండగులు విఫలయత్నం చేశారని బాధితులు ఆరోపణ చేశారు. వారిలో హేమంత్ అనే యువకుడిని పట్టుకొని బోస్ చంద్రారెడ్డి అనుచరులు చంద్రగిరి పోలీసులకు అప్పగించారు.
చంద్రగిరిలోని మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. నిందితులకు ఫోటోలు పంపించి రూ.3 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపారని ఆరోపించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు రంగంపేట చేరుకుని నిందుతుడు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నటుడు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల మాకు ప్రాణహాని ఉందని బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని చంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రంగంపేట కూడలిలో ధర్నా చేసిన బాధితులతో పాటు గ్రామస్తులు కూడా ధర్నా చేశారు. ‘ఎంబీ యూనివర్సిటీ అరాచకాలు నశించాలి’, ‘మోహన్ బాబు డౌన్ డౌన్’, ‘మోహన్ బాబు దౌర్జన్యం నశించాలి’, ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ బాధితులు, గ్రామస్థులు నినాదాలు చేశారు.
భూమి విషయంలోనే
ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. నాగపట్నం సర్వే నెంబర్ 10.2లో 35 సెంట్ల భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహకులు కన్నేశారు. ఆ భూమిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని మాపై నిర్వహకులు కక్ష్య పెంచుకున్నారు. 8 కోట్ల విలువైన భూమిపై సహ చట్టం కింద వివరాలు సేకరిస్తున్నామని మాపై గతంలోనూ దాడికి యత్నించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ భూమిలో ఏవో పనులు జరుగుతున్నాయి.. ఎవరికైనా కేటాయించారా అని నిన్న కూడా మేం సహ చట్టం కింద దరఖాస్తు చేశాం. దాంతో ఆ భూములు తమకు రాకుండా అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో వారు మమ్మల్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని రంగంపేట ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఆరోపణలు చేశారు.