DNA Test For Cheetah: చిరుతకు డీఎన్ఏ పరీక్షలు ఎన్ని దశలలో చేస్తారు, మ్యాన్ ఈటరా కాదా ఇలా గుర్తిస్తారంటే!
DNA Test For Cheetah: తిరుమలలో బంధించిన చిరుతపులికి డీఎన్ఏ టెస్టులు నిర్వహించి అది మ్యాన్ ఈటరా కాదా అని గుర్తించేందుకు పలు పరీక్షలు నిర్వహించనున్నారు.
DNA Test For Cheetah: తిరుపతి: కాలి నడక మార్గంలో ఆరేళ్ళ బాలికపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటనలో చిరుతపులి మ్యాన్ ఈటర్ ఆ కాదా అనేది నిర్ధారించుకునేందుకు నమూనాలను ఐసర్ కి తిరుపతి ఎస్వీ జూ పార్క్ అధికారులు పంపారు. అలిపిరి నడక మార్గంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వెళ్తున్న ఆరేళ్ళ బాలిక లక్షితపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.
చిన్నారులపై వరుస దాడులతో అప్రమత్తం అయిన టిటిడి అటవీ శాఖ అధికారులు అలిపిరి నడక మార్గంలోని ఏడోవ మైలు నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో చిరుతల జాడలను గుర్తించేందుకు ట్రాప్స్ ను ఏర్పాటు చేసి ఈ నెల 14వ తారీఖున చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకోగా, మరో చిరుతను సైతం అదే ప్రాంతంలో పట్టుకుని ఈ రెండు చిరుతలను తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ కు తరలించారు అధికారులు. అయితే ఆ చిరుతపులి మ్యాన్ ఈటర్ కాదా అనేది తెలుసుకునేందుకు నమూనాలను సేకరించారు.
చిరుతపులి డీఎన్ఏ పరీక్షలు ఎన్ని దశలు ఉంటాయంటే..
శేషాచలం అటవీ ప్రాంతంలో బోనుకు చిక్కిన రెండు చిరుతలను ఎస్వీ జూపార్క్ లో ఉంచి సంరక్షిస్తున్నట్లు తిరుపతి ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ సెల్వం వెల్లడించారు. తిరుపతి ఐసర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రిసర్చ్ కాలేజ్ ఆఫ్ రీజనల్ ) నుండి వచ్చి శాస్త్రవేత్తలు ఆ రెండు చిరుతల నమూలనాలను స్వీకరించి డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందన్నారు.
బాలిక శరీరం నుంచి నమూనాలను, అదే విధంగా ఘటన స్ధలంలో సేకరించిన చిరుతపులి లాంటి వెంట్రుకలు, రక్తం, యూరిన్ నమూనాలను సేకరించిన తర్వాత, జూపార్క్ తరలించిన చిరుత పులి వెంట్రుకలను, యూరిన్, మోషన్ నమూనాలను సేకరించి ఐసర్ శాస్త్రవేత్తల ద్వారా ల్యాబ్ కు పంపామన్నారు. డీఎన్‌ఏ పరీక్షలు మూడు దశల్లో ఉంటుందని, ఈ పరీక్షలకు రెండు వారాలు సమయం పడుతుందని ఐసర్ శాస్త్రవేత్తలు తెలియజేశారని, అయితే చిరుతపులి బాలికను చంపిందా అనేది ఐసర్ శాస్త్రవేత్తలు ఇచ్చే నివేదిక వచ్చిన తర్వాత తేలనుందన్నారు.
ఇందులో మూడు దశల్లో నమూనాలను పరీక్షిస్తారని, ఇందులో ముందుగా డీఎన్ఏ సారం గుర్తించే ప్రక్రియ, రెండోవది మాల్యూక్లర్ మార్కర్ బట్టీ ఆ నమూనాలు చిరుతపులిదా లేక వేరే వన్యమృగమా అనేది గుర్తిస్తారు. మైక్రో శాటిలైట్ మార్క్స్ బట్టీ వచ్చే నమూనాలు ఒక్కటైతే ఆ జంతువు మ్యాన్ ఈటర్ అవునా, కాదా అనేది నిర్ధారణ అవుతుందని, అయితే ఐసర్ శాస్త్రవేత్తలు పూర్తి స్ధాయిలో ఇచ్చిన నివేదిక ప్రకారమే ఆ చిరుత మ్యాన్ ఈటర్ ఐతే ఎస్వీ జూపార్క్ లో ఉంచుతామని, మ్యాన్ ఈటర్ కాకపోతే అటవీ ప్రాంతంలో వదిలేస్తాం అని ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ సెల్వం చెప్పారు. తిరుమలలో 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు.