Nara Lokesh: తాడేపల్లిలో పెద్దపిల్లి - తాడిపత్రిలో చిన్నపిల్లి, ప్యాంట్లు తడుస్తున్నాయ్: నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
ధర్మవరంలో చేసిన పాదయాత్రతో అబ్బాయి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్యాంట్ తడుపుకున్నారని, ఇక్కడ బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పాదయాత్ర ప్రవేశించకుండానే తడుపుకున్నాడని నారా లోకేశ్ ఎగతాళి చేశారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వెళ్లిన ప్రతి చోటా లోకేశ్ స్థానిక నాయకుల అక్రమాలపై గళం విప్పుతున్నారు. తాము తెచ్చిన కంపెనీల వద్ద సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగుతుండగా, బుధవారం రాత్రి బహిరంగ సభ ద్వారా లోకేశ్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ లో పరదాల మాటున జగన్ అనే ఒక పెద్ద పిల్లి ఉందని, ఆ పిల్లి అండతో తాడిపత్రిలో పెద్దారెడ్డి అనే చిన్నపిల్లి అవినీతి అక్రమాలతో రాజ్యమేలుతోందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. యాడికి మండలం రాయలచెరువులో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.
తాడిపత్రి పిల్లిని చూస్తే ఎంతో జాలి వేస్తోందని అన్నారు. ధర్మవరంలో చేసిన పాదయాత్రతో అబ్బాయి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్యాంట్ తడుపుకున్నారని, ఇక్కడ బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పాదయాత్ర ప్రవేశించకుండానే తడుపుకున్నాడని ఎగతాళి చేశారు. తన పాదయాత్ర వస్తుండగానే ఇసుక రీచ్ లను మూయించేశాడని అన్నారు. పెద్దారెడ్డి అవినీతికి అంతే లేదని, పెద్దపప్పూరు ఇసుక రీచ్ కు వెళ్లేసరికి జడుసుకొని పొక్లెయిన్‌లు, టిప్పర్లను పక్కన పెట్టించాడని అన్నారు.
తాడిపత్రి పిల్లి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాకా వెళ్లి బిల్డప్ ఇస్తుందని, పిల్లి సరదాగా సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన సింహం అవుతుందా? అని అన్నారు. తాడిపత్రి పిల్లిని చూస్తే జాలి వేస్తుందంటూ లోకేశ్ అన్నారు. ఎమ్మెల్యే కాకముందు చిన్న వాహనం ఉండేదని, ఇప్పుడు పదుల కొద్దీ లగ్జరీ కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈయన అవినీతిలో అంచెలంచెలుగా ఎదిగాడని అన్నారు.
పెద్దారెడ్డి ఇసుక రీచ్ వీడియో ట్వీట్
యువగళం పాదయాత్ర 67వరోజు ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సింగంగుట్టపల్లి వద్ద పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించగానే ఘనంగా స్వాగతించారు. ‘‘అబ్బాయ్ కేతిరెడ్డి కబ్జాలు ధర్మవరంలో చూశాం. తాడిపత్రిలో బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో అబ్బాయ్‌ని మించిపోయాడు. పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ ఇది. ఇసుక తవ్వకాలకు 10 ఎకరాలు కేటాయిస్తే, పదింతల విస్తీర్ణంలో తవ్వకాలకి బరితెగించారు. ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది బాబాయ్ గ్యాంగ్. నేను వస్తున్నానని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసినా, ఇసుక మాఫియా విధ్వంసం ఆనవాళ్లు అలాగే ఉన్నాయి’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
అబ్బాయ్ కేతిరెడ్డి కబ్జాలు ధర్మవరంలో చూశాం. తాడిపత్రిలో బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో అబ్బాయ్‌ని మించిపోయాడు. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ ఇది.(1/2)#YCPSandMafia pic.twitter.com/ddvyly2hNM
— Lokesh Nara (@naralokesh) April 11, 2023