Crime News: 12 ఏళ్లకే తాళం పగలగొట్టడం నేర్చాడు- లగ్జరీ లైఫ్ కోసం 150 చోరీలు
విలాసాల కోసం 12 ఏళ్లకే చోరీలు చేయడం మొదలు పెట్టాడు. జైలుకు వెళ్లి వచ్చినా బుద్ది మారలేదు. జైలుకు వెళ్లడం రావడం మళ్లీ చోరీలు చేయడం ఇదే అతని లైఫ్ స్టైల్
ఒంటరిగా ఉన్న ఇళ్ళు, తాళాలు వేసిన ఇళ్ళనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. చిత్తూరు పోలీసు గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి ఘరానా దొంగ అరెస్టు వివరాలు వెల్లడించారు. ఇటివల వరుసగా చిత్తూరు, కార్వేటినగరంలో నమోదైన దొంగతనలు, చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాల దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు తెలిపారు. దర్యాప్తులో వచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా చిత్తూరులో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ మహేష్‌ను అరెస్టు చేశారు. చిత్తూరు రిజర్వు ఫారెస్ట్ వద్ద అరెస్టు చేసి 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు టౌన్, సీతానగర్‌కు చెందిన మహేష్(33) విలాసాల కోసం దొంగతనాలు చేస్తున్నాడు. దీన్నే వ్యసనంగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు. 12 ఏళ్ల నుంచే దొంగతనాలు చేయడం ప్రారంభించాడని, సింగిల్‌గా ఉన్న ఇల్లు, తాళం వేసిన ఇళ్లనే ఎంచుకుంటాడు. రెక్కి నిర్వహించి పథకం ప్రకారం దొంగతనం చేసేవాడు. దొంగిలించిన సొత్తుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎంజాయ్ చేసే వాడని పోలీసుల విచారణలో తెలిందన్నారు. దొంగతనం కేసులలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తరువాత జైలు నుంచి విడుదలైన వెంటనే మళ్లీ దొంగతనం చేయడం అలవాటుగా చేసుకున్నాడు.
మహేష్‌పై ప్రకాశంలో నాలుగు, గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది, కృష్ణ జిల్లాలో ఒకటి, కర్నూలులో రెండు, విజయవాడ అర్బన్‌లో నాలుగు, గుంటూరులో నాలుగు, అనంతపురంలో రెండు, తిరుపతి అర్బన్‌లో 1, గుంటూరులో నాలుగు, నెల్లూరులో 11, మహబూబ్ నగర్‌లో 3, సిద్దిపేట్‌లో 8, ఖమ్మంలో 3, సంగారెడ్డిలో 2 కేసులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 58 కేసుల్లో నిందుతుడుగా ఉన్నట్లు చెప్పారు.
కార్వేటినగరం పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న చలంపాల్యం నాగరాజుని చింతమండి క్రాస్ వద్ద అరెస్ట్ చేసామని, ఇతని వద్ద నుంచి 108 గ్రాముల బరువు గల 4 బంగారు మాంగళ్యం చైన్స్, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను పొలాలలో ఉండే ఒంటరి వృద్ద మహిళలను గుర్తించి వారిని భయపెట్టి, కొట్టి వారి మెడలోని బంగారు చైన్‌లు దొంగతనం చేసే వాడు. ఇతనిపై 4 కేసులు ఉన్నట్లు ఎస్పి రిశాంత్ రెడ్డి చెప్పారు.