Tirupati News: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు, స్టేషన్ ముందు తండ్రి, వైసీపీ నేతల నిరసనలు - కాసేపటికి విడుదల
AP Latest News: మోహిత్ రెడ్డి దుబాయ్ వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లగా.. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో పట్టుకున్నారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి ఆయన్ను అరెస్ట్ చేశారు.
Chevireddy Mohith Reddy Arrest: వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తరలించారు. దీంతో వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. గత ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత రోజు అప్పటి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. స్ట్రాంగ్ రూం పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నానిపై దుండగులు దాడి చేశారు. ఈ కేసులోనే మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం రాత్రి మోహిత్ రెడ్డి దుబాయ్ వెళ్లబోతుండగా ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో బృందం ఆయన్ను అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ఆదివారం ఉదయం ఎస్వీయూ పీఎస్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 34 మందిని అరెస్టు చేశారు. అయితే, మోహిత్ రెడ్డి అరెస్టుతో ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
‘‘మోహిత్ మీద కేసు పెట్టి భయపెట్టాలని చూసారు. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది. మీరు జడ్జి దగ్గర జస్టిఫికేషన్ చెప్పుకోండి.. అక్కడ న్యాయమూర్తి సమక్షంలో న్యాయం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అధికారుల సమక్షంలో ఉంటే అతని పై ఎలా కేసు పెడతారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది. 52 రోజుల తర్వాత నానిపై దాడి కేసులో 37వ నిందితుడిగా చేర్చారు. దుబాయ్ లో స్నేహితుడి పెళ్లికి మోహిత్ రెడ్డి వెళ్తుంటే బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’’ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దీంతో రోడ్డుపై కూర్చోని భాస్కర్ రెడ్డి, నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాసేపటికి చెవిరెడ్డి విడుదల
41ఏ సీఆర్పీ నోటీసులు జారీ చేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలనే షరతుపై తనను విడుదల చేశారని మోహిత్ రెడ్డి తెలిపారు. విడుదల తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని.. తనను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు.