Chandragiri: నెల నుంచి నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, అడ్డుకుంటే ఆత్మహత్యే - పులివర్తి నాని ఆమరణ దీక్ష
ఇసుక మాఫియా తీసిన గోతిలో పడి విద్యార్థి కార్తీక్ మృతి చెందడం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పులివర్తి నాని ఆరోపించారు.
చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పెట్రోల్ క్యాన్ తో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఇసుక మాఫియా వల్ల ఏర్పడ్డ గోతుల్లో విద్యార్థి కార్తీక్ చనిపోయిన ఘటనలో న్యాయం కోసం తన ప్రాణం పోయేంత వరకు పోరాడతానని అన్నారు. అడ్డుకోవాలని చూస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ గా ప్రజల భద్రత తనపై ఉందని అన్నారు. నెల రోజులుగా పోరాటం చేస్తుంటే శవ రాజకీయాలు అంటారా అని ప్రశ్నించారు.
ఇసుక మాఫియా తీసిన గోతిలో పడి విద్యార్థి కార్తీక్ మృతి చెందడం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కార్తీక్ తల్లితండ్రులను మభ్యపెట్టి శవ రాజకీయాలు అని చేయిస్తారా అని నిలదీశారు. ఇసుక తోడేస్తే రైతులు నష్టపోతారని, ప్రమాదాలు జరుగుతాయని తెలియదా అని అన్నారు. నెల రోజులుగా నెత్తీనోరూ మొత్తుకుంటున్నా స్పందించపోగా 24 మందిపై కేసులు పెట్టిన విషయం మరచిపోయారా? అని ప్రశ్నించారు.
ప్రజల కోసం, రైతులు కోసం పోరాటాలు చేస్తే శవ రాజకీయాలంటారా? అని అన్నారు. రామాపురంలో డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ఎమ్మెల్యే చేసింది చెత్త రాజకీయం కాదా? అని ప్రశ్నించారు. రాయలచెరువు కట్ట సమయంలో చాపర్ (హెలికాప్టర్) రాజకీయాలు చేసింది ఎవరని ప్రశ్నించారు. ఇసుక మాఫియాపై కేసులు, సహకరించిన అధికారులను సస్పెండ్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.