Viral Video: తిరుమల క్యూలైన్లో రాత్రి భక్తుడు హల్‌చల్.. ఏదో ఫ్రస్టేషన్‌లో చేశానంటూ అంతలోనే ట్విస్ట్
Tirumala News | తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ ఓ భక్తులు నిరసన చేశాడు. తోటి భక్తులను సైతం ప్రేరేపించి నినాదాలు చేపించడం తెలిసిందే. అయితే అంతా బాగుందంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

Tirumala Temple News Updates | తిరుమల: తిరుమల ఆలయంలో సర్వదర్శనం క్యూలైన్లో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ శుక్రవారం రాత్రి ఓ భక్తుడు చేసిన నిరసనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. దర్శనం క్యూలైన్లో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ రాత్రి ఓ భక్తుడు నిరసనకు దిగాడు. తోటి భక్తులను సైతం ప్రేరేపించి టీటీడీ ఛైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వీడియో కలకలం రేపింది. అది చూసిన భక్తులు నిజంగానే తిరుమలలో భక్తులకు సౌకర్యాలు సరిగ్గా లేవా అనే అనుమానం తలెత్తింది. కానీ అంతలోనే భక్తుడు ట్విస్ట్ ఇచ్చాడు. కొంచెం అనారోగ్యంగా ఉండటంతో, ఏదో ఫ్రస్టేషన్‌లో అలా చేశాను అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు. తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పాడు.
టీటీడీ పెద్దలకు క్షమాపణలు
టీటీడీ కి వ్యతిరేకంగా దర్శన క్యూలైన్ లో చైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు కాకినాడకు చెందిన భక్తుడు అప్పారావ్. దర్శనం అనంతరం టీటీడీ పెద్దలకు క్షమాపణ చెప్పాడు. నిరసన చేస్తే క్యూలైన్లో ఉన్న భక్తులను త్వరగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతో పాలు అందలేదని అబద్ధం చెప్పానని ఆ భక్తుడు ఒప్పుకున్నాడు. తిరుమల ఆలయం లాంటి పవిత్రస్థలంలో తాను చేసిన తప్పును వీడియో రూపంలో అంగీకరించాడు. టీటీడీ కి వ్యతిరేకంగా దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం కరెక్ట్ కాదని ఆలస్యంగా తెలుకున్నట్లు తెలిపాడు.
తనకు ఉదయం నుంచి జ్వరం ఉందని, ఒంట్లో నలతగా ఉందన్నాడు. భక్తులకు సాంబార్ అన్నం ప్రసాదం ఇచ్చారని తెలిపాడు. కానీ పాలు ఇస్తారేమోనని, అసలే దర్శనం ఆలస్యం అవుతోందని పాలు లేవని చెప్పానని ఒప్పుకున్నాడు. అందర్నీ అడిగితే వారికి శ్రీవారి అన్న ప్రసాదం, పాలు లభించాయని ఏ ఇబ్బంది కలగలేదని తెలిసిందన్నాడు. ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దాంతో కాస్త ఆలస్యమైందని ఆలస్యంగా గుర్తించాను.
టీటీడీపై నిత్యం ఏదో ఒక ప్రచారం..
భక్తులను ఆందోళనకు గురిచేసే విధంగా వీడియో చిత్రీకరించిన వ్యక్తి కోసం పోలీసులు, విజిలెన్స్ గాలింపు చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల టార్గెట్ గా కొందరు తరచూ అవాస్తవాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని.. భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. కొందరు భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని, వారి ట్రాప్‌లో పడొద్దని తిరుమలకు వచ్చే వారికి అధికారులు సూచించారు.
హుటాహుటీన క్యూ లైన్లకు వెళ్లి పరిశీలించిన అదనపు ఈవో
తమకు సౌకర్యాలు కల్పించలేదని, సమస్యలు ఉన్నాయని భక్తులు క్యూ లైన్లో నిరసన చేశారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెళ్లి సర్వదర్శనం క్యూ లైన్లు పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతా సరిగ్గా ఉందని, తమకు అన్న ప్రసాదం, జల ప్రసాదం లభించాయని.. ఏ సమస్య లేదని భక్తులు చెప్పడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు.






















