Tirupati: లైంగిక వేధింపులు వర్సెస్ చికెన్ పకోడా ... ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో రచ్చ రచ్చ
తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు ఆరోపణలు రచ్చకెక్కాయి. ప్రిన్సిపాల్, వార్డెన్ విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు రాగా... విద్యార్థినిలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ప్రిన్సిపాల్ అంటున్నారు.
విద్యాలయాలు అంటే జ్ఞానసముపార్జనకు మూలాలు. అందుకే పాఠశాలను దేవాలయం, గురువుగా భావిస్తాం. తల్లిదండ్రులు తర్వాత గురువుకి రెండో స్థానం ఇచ్చారు పెద్దలు. తల్లిదండ్రులు జన్మనిస్తే మంచి చెడులను తెలుసుకునే జ్ఞానాన్ని అందించేది గురువు. అందుకే సమాజంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ గురువు స్థానానికి మాయని మచ్చ తెస్తున్నారు కొందరు. విద్యా బుద్దులు నేర్పించాల్సిన గురువులే విద్యార్ధినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తిరుపతిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు
తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహిస్తారు. ఈ కోర్సులు చదవడానికి సుదూర ప్రాంతాల నుంచి విద్యార్ధినులు వస్తుంటారు. ఈ విద్యార్థినిల కోసం కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి కల్పిస్తుంటారు. ఈ కళాశాలలో సీటు పొందేందుకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ మహిళా కళాశాలకు సురేంద్ర నాయక్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. కళాశాలలోని విద్యార్ధినుల పట్ల కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర నాయక్, వార్డెన్ రామనాధం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీనిపై టీటీడీ అధికారులు స్పందించి ఆరోపణలపై డీఈవో స్ధాయి అధికారి గోవిందరాజులను విచారణ అధికారిగా నియమించారు.
ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెండ్
దీంతో రంగంలోకి దిగిన విచారణాధికారి గోవిందరాజులు విచారణ చేపట్టారు. లైంగిక వేధింపులు నిజమేనని నివేదిక సమర్పించడంతో నాలుగు రోజుల క్రితం ప్రిన్సిపాల్ సురేంద్ర నాయక్, వార్డెన్ రామనాధంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ఆందోళనకు దిగ్గారు. కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపుగా పది రోజులు గడుస్తున్నా ఇంకా టీటీడీ డీఈవో స్ధాయి అధికారి గోవిందరాజులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Also Read: మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లేదు.. లేదు.. అది ప్రాంక్ అంటున్న ప్రొఫెసర్
చికెన్ పకోడా ఇష్యూ
టీటీడీ కళాశాలలో మాంసాహారం, మద్యంపానం నిషేధం. అయితే విద్యార్ధినులు కళాశాలలో చికెన్ పకోడా తింటుండగా పట్టుకున్నామని ప్రిన్సిపల్, వార్డెన్ విచారణ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్ధినులు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్ లు ఉన్నతాధికారులకు విచారణలో వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు పలు కోణాలపై విజిలెన్స్ అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఓరియంటల్ కళాశాలలో విద్యార్ధినులు వర్సెస్ ప్రిన్సిపాల్, వార్డెన్ ఘటనలు తిరుపతిలో చర్చనీయంగా మారాయి.
Also Read: భారత్‌లో ఒమిక్రాన్ కల్లోలం.. నిన్న ఒక్కరోజులో 552 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి