TTD Workers: జగనన్న మాట నిలబెట్టుకో...రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ కార్మికుల ఆందోళన... ముగ్గురు ఉద్యోగులపై వేటు
అధికారంలోకి రాగానే టైం స్కేల్ ఇస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. నేడు, రేపు సీఎం జగన్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. టీటీడీ కార్మికుల సమస్యలపై సీఎం జగన్ స్పందించాలని కార్మికులు కోరారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు కార్మికులు చేపట్టిన ఆందోళన నేటితో ఐదో రోజుకు చేరింది. కార్మికులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభానికి ముందు రోజు తిరుమల కొండపై టీటీడీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో టైం స్కేల్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్మికుల విషయంలో మాట తప్పడం ఎంత వరకూ సమంజసమన్నారు.
Also Read: ఉత్తరాంధ్రపై విరుచుకుపడనున్న జవాద్ తుఫాన్.. ముందు జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష
సీఎం జగన్ వీరాభిమాని ఆవేదన
టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో, పాలకమండలి పెద్దలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కార్మికులు విమర్శించారు. ధరలు పెరిగి బతుకులు దుర్భరంగా ఉన్న సమయంలో కార్మికులకు ఊరట కల్పించాల్సిన టీటీడీ యాజమాన్యం తేలిక భావంతో మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. అనంతరం టీటీడీ కార్మికురాలు రాధా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్ల బారి నుంచి కాపాడాలని, కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేశారు. సీఎం కార్మికుల సమస్యలపై జోక్యం చేసుకుని మేలు చేయక పోతే కార్మికులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తాను వీరాభిమాని అని తాను నాలుగు సార్లు సీఎంను కలిసి తమ గోడు విన్నవించుకునేందుకు తాడేపల్లికి వెళ్లి కలిసే ప్రయత్నం చేసిన అక్కడి అధికారులు కోవిడ్ కారణంగా కలవనీయలేదని టీటీడీ కార్మికురాలు రాధ ఆవేదన వ్యక్తం చేసింది.
ముగ్గురు ఉద్యోగులపై వేటు
కార్మికులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ సస్పెషన్ వేటు చేసింది. టీటీడీ కార్మికుల ధర్నాకు మద్దతు పలికారని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున్, గుణశేఖర్, వేంకటేశం లను సస్పెండ్ చేశారు. గత ఐదు రోజులుగా తిరుపతి ఏడీ బిల్డింగ్ ముందు కాంట్రాక్ట్ నుంచి కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి