Tirumala News : తిరుమల కొండపైకి కాలుష్య రహిత ప్రయాణం, త్వరలో అందుబాటులోకి ఒలెక్ట్రా ఈ-బస్సులు
Tirumala News : తిరుమల కొండపై భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. స్వామివారి సేవకు 10 ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వాలని ఎంఈఐఎల్ సంస్థ నిర్ణయించింది.
Tirumala News : మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం దేవస్థానం రవాణా విభాగం జనరల్ మేనేజర్ పీవీ శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలు కలిగిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బస్సులను తిరుమలకు వచ్చే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడీ వినియోగించనుంది. టీటీడీ డి అధికారులకు బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో తెలియజేస్తారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. తిరుమల పవిత్రతను తెలిపే ఫొటోలను బస్సు పై ముద్రించారు. బస్సులో కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దేవస్థానం పాలకవర్గం, ఉన్నతాధికారులకు బస్సు పని తీరును వివరిస్తానని తెలిపారు. ఎంఈఐఎల్ విద్యుత్ బస్సులను అందించటం సంతోషంగా ఉందని, వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందన్నారు.
శబ్ధ, వాయు కాలుష్యంలేని ప్రయాణం
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ... ఎంఈఐఎల్ భగవంతుని సేవలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. సంస్థ ప్రయాణంలో వేంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదాలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతున్నామన్నారు. సంస్థ పురోగతి, భవిష్యత్తు ప్రయత్నాలలో శ్రీవారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు. 9 మీటర్ల పొడువున్న 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో అందించనున్నామని స్పష్టం చేశారు. ఈ-బస్సుల కోసం ఛార్జీంగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్ని ఈ విద్యుత్ బస్సుల ద్వారా అందిస్తామని ప్రదీప్ తెలిపారు. ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిరుమలలో 12 డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం అయితే టీటీడీకి డీజిల్ ఖర్చుల భారం తగ్గటంతో పాటు పర్యావరణం మెరుగుపడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 50 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ తిరుపతి , తిరుమల మధ్య నడుస్తూ భక్తులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
Today, TTD GM Sesha Reddy visited the #Olectra plant & approved the proto of the 10 e-buses MEIL is offering to the hill shrine. These e-buses will accelerate TTD’s mission of clean #transport uphill.@TTDevasthanams #Olectragreentech #electricmobility #MEILIsTheBest pic.twitter.com/cjbVamC5xw
— Megha Engineering and Infrastructures Ltd (@MEIL_Group) March 2, 2023