Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు
Tirumala RTC Charges : తిరుమల శ్రీవారి భక్తులపై మరింత భారం పడనుంది. డీజిల్ సెస్ ఛార్జీల పెంపుతో తిరుమల తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి.
Tirumala RTC Charges : తిరుమల శ్రీవారి భక్తులకు ఆర్టీసీ ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపుతో ఛార్జీలు పెరిగాయి. దీంతో తిరుమల-తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు కూడా పెరిగాయి. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్ పై అదనంగా రూ. 15 భారం పడనుంది. ప్రస్తుత ఛార్జీ రూ. 75 ఉండగా తాజా పెరుగుదలతో రూ. 90లకు చేరింది. పిల్లల టికెట్ ధర రూ. 45 నుంచి రూ. 50 పెరిగింది. కొండపైకి రానుపోను టికెట్ ధర రూ.130 ఉండగా తాజా పెంపుతో రూ. 160లకు చేరింది. ధరల పెరుగులతో సామాన్యులపై మరింత భారం పడనుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. ఇవాళ్టి నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. డీజిల్ సెస్ పెంపుతో ఛార్జీలు పెంచడం తప్పడం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంపు
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరోసారి పెరిగాయి. డీజిల్ సెస్ పెంపుతో ఛార్జీలు పెంచాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. డీజిల్ సెస్ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. డీజిల్ సెస్ పెంపుతో పలు రాష్ట్రాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నాయి. టీఎస్ఆర్టీసీ కూడా డీజిల్ సెస్ కారణంగా పలుమార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి పెంచిన టికెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఏపీలో సిటీ సర్వీసులు మినహా అన్ని బస్సుల్లో డీజిల్ సెస్‌ను ఆర్టీసీ పెంచింది.
తప్పనిసరి పరిస్థితుల్లో
తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. జూన్ 29న డీజిల్ మార్కెట్(బల్క్) ధర 131 రూపాయలకు పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీకి ప్రతి రోజు రూ.2.50 కోట్ల అధిక ఖర్చు అవుతుందన్నారు. బస్సుల నిర్వహణ ఖర్చులు పెరగడం, అవసరమైన టైర్లు, స్పేర్ పార్టుల ధర పెరగడంతో ఛార్జీల పెంపు అనివార్యమైందన్నారు. ఇది ప్రయాణికులపై వేసే భారం కాదన్నారు. అత్యవసర డీజిల్ పై వేసే సెస్ మాత్రమేనని వెల్లడించారు. స్లాబ్ పద్ధతిలో ప్రయాణికులు ప్రయాణం చేసే కిలోమీటర్ల ఆధారంగా డీజల్ సెస్ విధిస్తామన్నారు. వీటితో పాటు విద్యార్థుల బస్సు పాస్ ఛార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయని ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమల రావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఛార్జీల పెంపు
పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10, తొలి 30 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ పెంపులేదు. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5 లు సెస్ ఉంటుంది. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10 సెస్, 100 కి.మీ దాటితే రూ.120 సెస్ విధించారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్ ధరలపై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 30 కి.మీ వరకు డీజిల్ సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్, 66 నుంచి 80 కి.మీ వరకు రూ.10 సెస్ పెంపు ఉంటుంది. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదని అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంపు ఉంటుంది. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేస్తారు.