Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!
Tirumala Rush: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం నాలుగ గంటల వరకే 50 వేల 443 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Tirumala Rush: తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఆదివారం ఒక్క రోజే 50,443 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 48 గంటలపైనే సమయం పడుతోంది. ప్రస్తుతం తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు, క్యూలైన్లు సేవా సదన్ దాటి రింగ్ రోడ్డు వరకు భక్తులు బారులు తీరారు. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకే 50,443 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి స్వామి వారి దర్శనానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
మొదటి నివేదనగా పచ్చిపాలు..
శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరుస్తారు. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాధనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఆ తరువాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించి, ముందుగా వైఖానస అర్చకులు బ్రహ్మ తీర్థాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాతే జియ్యంగార్లకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు.
తోమాల సేవ ప్రారంభం..
అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాల పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అటు తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.
బెల్లంతో కలిపిన నువ్వుల పిండి సమర్పణ..
శ్రీవారి మూలవిరాట్టుకు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటు తరువాత ఆలయంలో ఉన్న అన్ని దేవుళ్లకు, విమాన వెంకటేశ్వరుడితో సహా ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. అటుతరువాత తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు.
చివరగా ఏకాంత సేవ..
సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్ప మాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.