Chaganti Koteswara Rao : టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు
Chaganti Koteswara Rao : టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారు పదవిని ప్రవచన కర్త చాగంటి తిరస్కరించారు.
![Chaganti Koteswara Rao : టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు Tirumala Chaganti Koteswara rao rejected TTD Dharma Parishad Advisor post DNN Chaganti Koteswara Rao : టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/c438e43c23d4b843685a5b709ca857831677950908223235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chaganti Koteswara Rao : టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటి కోటేశ్వరావును నియమిస్తూ జనవరిలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే తాజాగా సలహాదారు పదవిని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదన్నారు. టీటీడీకి అవసరం అనిపించినప్పుడు తప్పకుండా ముందు ఉంటానన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న ధార్మిక పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చాగంటి కోటేశ్వరరావు ఈ పదవిని తిరస్కరించారు. దీనిపై టీటీడీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాగంటి కోటేశ్వరరావు ఈ విషయంపై స్పందించారు.
"నాకు టీటీడీ డిప్యూటీ ఈవో ఫోన్ చేశారు. నా మీద అంత నమ్మకంతో, గౌరవంతో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ గౌరవ సలహాదారుగా నియమించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ నేను 38 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను. సలహాదారు అంటే ఎప్పుడైనా ధర్మ ప్రచార పరిషత్ సమావేశం జరిగితే... ఏదైనా విషయంలో వాళ్లకు అనుమానం వస్తే... ఫలానా పని చేస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందా? అని చర్చిస్తారు. ధర్మ ప్రచార పరిషత్ లో సభ్యులు చాలా మంది ఉంటారు. వాళ్లందరూ విశేషమైన వ్యక్తులు. వాళ్లకు అనుమానం వస్తే... నన్ను అడగాలి. అంతమందికి తట్టకపోతే నేను సలహా ఇవ్వాలి. దానికి నేనన్నాను... పదవి ఎందుకు? మీరు ఏం అనుకోకండి. పదవి ఇస్తే చేస్తానని ఎందుకు అనుకున్నారు. వేంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన కింకరుడిని నేను. నా ఊపిరి ఆయన. నా ఊపిరి ఆయన సేవకు పనికి వస్తే అంతకన్నా ధన్యుడినా? అందుకే చెప్పా నాకు ఏ పదవి వద్దు. టీటీడీ వారికి నా వల్ల ఈ పని జరుగుతుందని అనిపిస్తే... నువ్వు వచ్చి ఈ పనిచేసిపెట్టు అని అడిగితే, పరుగున వెళ్లి చేస్తాను. దానికి ఈ పదవిలో ఉంటే కోటేశ్వరరావు చేస్తాడన్న మాటే లేదు. అందుకే దయచేసి నాకు ఏ పదవి వద్దు. ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేయమని కోరాను. నేను చేయగలిగిన పని ఏదైనా సరే చేస్తానని చెప్పాను. నేను చెప్పిన ప్రవచనాలు టీటీడీ భక్తి ఛానల్ లో ప్రసారం చేశారు. అంతకన్నా పదవి ఎందుకు?. సేవచేయాలంటే పదవే అవసరంలేదని చెప్పాను " - చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కర్త
ఇటీవల సీఎం జగన్ ను కలిసిన చాగంటి
అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు మాట్లాడారు. అయితే చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమించినందుకు మర్యాదపూర్వకంగా కలిశారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి చాగంటిని సత్కరించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను కూడా చాగంటి కోటేశ్వరరావు సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ సీఎం జగన్ పైచాగంటి కోటేశ్వరరావు ప్రశంసలు కురిపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)