Kakinada Politcs : తూ.గో జిల్లాలో బీజేపీ, జనసేనకు కేటాయించే సీట్లు ఇవేనా ? టీడీపీ సీనియర్లకు మొండి చేయే !
Andhra News : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై మూడు పార్టీలు ఓ స్పష్టతకు వచ్చాయి. బీజేపీకి రాజమండ్రి అర్బన్ లేదా పి.గన్నవరం కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
East Godavari district Seats : ఏపీలో అత్యధిక శాసనసభ స్థానాలు కలిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. ఏ స్థానంలో ఏ పార్టీ బరిలో ఉండాలనే దానిపై పంపకాలు కూడా చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి మూడింట రెండొంతుల స్థానాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బరిలో దిగబోతోంది. మొత్తం 21 స్థానాలకు 15 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది. మిగిలిన ఆరు స్థానాలకు 5 చోట్ల జనసేన అభ్యర్థులు, ఒకచోట బిజెపి బరిలో ఉంటాయి.
బీజేపీకి కేటాయించే స్థానం ఏది ?
2014 ఎన్నికల్లో బిజెపి గెలిచిన రాజమహేంద్రవరం అర్బన్ కావాలని బీజేపీ పట్టుబడుతోదంి. బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సీటు కూడా బిజెపి ఖాతాలో పడడంతో ఎంపీ స్థానం పరిధిలో ఒక అసెంబ్లీ సీటుకి బరిలో ఉండేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే రాజమండ్రి అర్బన్ కు ఇప్పటికే టీడీపీ టిక్కెట్ ను ఆదిరెడ్డి వాసుకు ప్రకటించారు. ఈ కారణంగా బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని.. టిక్కెట్ ప్రకటించినప్పటికీ పోటీకి వెనక్కి తగ్గిన రాజేష్ నియోజకవర్గం పి.గన్నవరం బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఐదు చోట్ల పోటీ చేయనున్న జనసేన
జనసేన ఇప్పటికే రాజానగరం, కాకినాడ రూరల్ స్థానాలను ప్రకటించింది. అలాగే జనసేన సిట్టింగ్ సీటు రాజోలులో కూడా ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఈ మూడు స్థానాలతో పాటు అమలాపురం, పిఠాపురం, రామచంద్రపురం స్థానాల్లో రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రామచంద్రాపురం కోసం టిడిపి కూడా పట్టుబడుతుంది. శెట్టిబలిజకు జిల్లాలో ఒక సీటు కేటాయించడం అనివార్యం కావడంతో టిడిపి ఆస్థానం కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. అదే జరిగితే జిల్లాలో మరొక స్థానం జనసేనకు దక్కుతుందా లేక ఐదు సీట్లతో సరు పెట్టుకోవాల్సి వస్తుందా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
15 సీట్లలో టీడీపీ పోటీ
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తుని, జగ్గంపేట, పెద్దాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, అనపర్తి, రాజమహేంద్రవరం సిటీ స్థానాల్లో అభ్యర్థులను టిడిపి ఖరారు చేసింది. రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని ఇప్పటికే సిట్టింగ్ ఎంఎల్‌ఎ భర్త ఆదిరెడ్డి వాసుకు ఖరారు చేసింది. ఆయన ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. కాకినాడ సిటీ విషయంలోనూ టిడిపి భారీగా కసరత్తు చేస్తుంది. జిల్లాలో ఒక్క సీట్ అయినా మత్స్యకారులకు కేటాయించాల్సిన అవసరం ఉండడంతో మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పేరు ఖరారు చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇక కందుల దుర్గేష్‌కు నిడదవోలు కేటాయించడంతో రాజమహేంద్రవరం రూరల్ స్థానంలో టిడిపి తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు ఖరారైంది. టిడిపి లిస్టులో 8 స్థానాలకు అభ్యర్థులకు లైన్ క్లియర్ అయ్యింది. మిగిలిన ఏడు సీట్లలో ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అందులో ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, రామచంద్రపురం, పి.గన్నవరం, గోపాలపురం, కొవ్వూరు ఉన్నాయి. ఈ సీట్లలో ఇప్పటికే ఆశావాహులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.