తిత్లీ తుపాను బాధితులకు నేటికీ అందని నష్టపరిహారం!
తిత్లీ తుపాను బాధితులకు నేటికీ నష్ట పరిహారం అందలేదు. ప్రభుత్వాలు మారినా సాయం మాత్రం అందలేదని వాపోతున్నారు. ఇకనైనా సాయం అందిస్తారా హామీలకే పరిమతం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
తితిలీ తుపానుతో గుండె చెదిరింది. ఇప్పటికీ ఆ ప్రాంతం కోలుకోవడం లేదు. తుపాను సమయంలో ఎన్నెన్నో హామీలు గుప్పించారు. తీరా ఉద్దానం ప్రాంత బాధిత రైతులు వేల మందికి పరిహారం అంద జేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అనర్హులకు అందిన మాట దేవుడెరుగు. అర్హులలో చాలా మందికి అందలేదని మొరపెట్టుకున్నా తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారం నోచుకోకపోవడంతో మరింత మనస్థాపం చెందుతున్నారు. కాళ్లు అరిగేలా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు తిరగడమే మిగిలింది తప్ప పరిహారం అందని వారికి నేటికి న్యాయం దొరకడం లేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వ హయాంలోనైనా బాధితులకు నష్టం అందుతుందనుకుంటే మొండి చేయి మిగిలిందని గగ్గోలు పెడుతున్నారు. పలాస సెగ్మెంటు పరిధిలోని చైతన్య రైతాంగ సంక్షేమ సంఘం తరఫున కొంత మంది రైతులు, రైతు సంఘ నాయకులు సోమవారం స్పందనలో కలెక్టర్ ను కలిసి ఢిల్లీ పరిహారంపై వినతి పత్రం అందించారు.
కొత్తగా పరిహారం ప్రసక్తే లేదు..
అదనంగా మంజూరు చేసింది అందకపోవడమే కాకుండా గతంలో గుర్తించిన బాధితులకు పరిహారం ఇవ్వలేదని మొర పెట్టుకున్నారు. దీనిపై కలెక్టర్ చెప్పే సమాధానంతో వచ్చిన బృందం షాక్ కు గురైంది. కొత్తగా పరిహారం ప్రసక్తి లేదని కలెక్టరు తేల్చి చెప్పారని ఇక తమకు దిక్కెవరని అంటున్నారు. న్యాయస్థానం లేక పోరాటమే శరణ్యంలా కనిపిస్తుందని మరికొందరు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తిత్లీ బాధితులను ఆదుకుంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంతో ఆశగా ఉద్దాన రైతాంగం ఎదురు చూసిందంటున్నారు. ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు దక్కాల్సిన నష్ట పరిహారానికి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడమే మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి వేల మంది రైతులు నిట్టూరుస్తున్నారు. తీరా కొత్తవారికి కలెక్టర్ కాదనడంతో మరింత దిగులు చెందుతున్నారు.
బినామీల పేర్లతో పెద్ద ఎత్తున పరిహారం..
గతంలో సీఎం ఇచ్చిన హామీలో భాగంగా రూ.189 కోట్లు అదనపు పరిహారం జూన్ నెలలో మంజూరు చేశారు. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తింది. ఈ నిధులు పంపిణీ చేసేశారు. పరిహారం పంపిణీ చేసేటపుడు కొందరి పేర్లు గల్లంతవ్వడం, కొత్తగా మంజూరు కాకపోవడంతో ఉద్దాన బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో అన్యాయం జరగ్గా తీరా ఈ సర్కారు వల్ల కూడా అదే పరిస్థితి ఎదురైందని తమను ఆదుకునే వారేవరని ప్రశ్నిస్తున్నారు. గతంలో బినామీల పేర్లతో పరిహారం పెద్ద ఎత్తున మంజూరు చేశారని అర్హులైన వారికి మాత్రం మొండిచేయి చూపారని అదనపు పరిహారం అందజేసేటపుడు అలాంటి తప్పిదాలు చోటుచేసుకోవని స్వయంగా సీఎం చెప్పడంతో ఎంతగానో ఆశించి ఎదురు చూశారు.
16 వేల మందికి నిలిపివేత..
అప్పట్లో జిల్లావ్యాప్తంగా 3.91 లక్షల మంది బాధితులుగా తేల్చారు. గత ప్రభుత్వ హాయాంలో 6,611 మంది రైతులకు దాదాపు 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ బాధిత రైతాంగానికి 2018లో ఆర్టీజీఎస్ అప్ లోడ్ చేసి ప్రభుత్వం ఆమోదం పొందిన అప్పట్లో పరిహారం అందివ్వలేదు. తీరా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు జూన్ లో రూ.182 కోట్లు మంజూరు చేయడంతో 90,789 మంది రైతులకు చెల్లించారు. గతంలో మంజూరు చేసిన వారిలో దాదాపుగా 16 వేల మందికి నిలిపివేశారు. దీనిపై టీడీపీ, కొందరు రైతులు అధికారులకు విన్నవిస్తున్న వాటిపై కనీసం దర్యాప్తు నిర్వహించడం లేదు. అలాగే గతంలో మంజూరు చేయాల్సి ఉన్న 6,611 మందికి నిధులు విడుదల కాలేదు. వాటిపై కూడా ఎవరు సమాధానం చెప్పడం లేదని ఆయా బాధిత రైతు దిగులు చెందుతున్నారు. వీరితో పాటు గతంలో మరికొందరు బాధిత రైతులు పేర్లు తప్పిపోయానని మొర పెట్టుకోవడమే మిగిలింది. తిత్లీ తుపానుతో నష్టపోయిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అనేక పర్యాయాలు హామీలివ్వడమే మిగిలింది తప్ప అధనంగా ఒక్కరికి పైసా సాయం చేయలేదని పలువురు రైతులు వాపోతున్నారు.
దాదాపు 20 వేల మందికి పరిహారం ఇవ్వట్లేదు..!
రైతు సంఘం నాయకులు మామిడి మాధవ రావు, దాసరి శ్రీరాములు, కొర్ల హేమారావు చౌదరి, మజ్జి బాబూరావు, గొర్లె చలపతిరావు, తామాడ త్రిలోచన కారి పురుషోత్తం, రాజాం గుణవంతు, ఎం. బాబురావు తదితరులు కలెక్టర్ ను కలిసి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కొన్ని దశాబ్దాల నుంచి ఉద్దానం ప్రాంత రైతులు అనేక కష్టాలు ఎదుర్కొం టుంది. తిల్లీ, హుదూద్ తుపాను రైతులకు నష్టం మిగిల్చింది. దాదాపు 20 వేల మంది రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే రైతులు తీసుకున్న చర్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.