(Source: ECI/ABP News/ABP Majha)
TTD Dharma Reddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి లైన్ క్లియర్ - ఊరటనిచ్చిన హైకోర్టు !
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అర్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అర్హత లేదని దాఖలైన పిటిషన్‌ను తోసి పుచ్చింది.
TTD Dharma Reddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. టీటీడీ ఈవోగా నియమించాలంటే దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవిచేసినా సరిపోతుందని హైకోర్టు నిర్ధారించింది. ఏవి ధర్మారెడ్డి అర్హతల్లో జిల్లా కలెక్టర్ సమానమైన పదవిలో వుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిటిషన్‌ను తోసి పుచ్చింది. టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆ పైస్థాయి అధికారికే టీటీడీ ఈవోగా అర్హత
దేవదాయ చట్టంలోని 107వ సెక్షన్ ప్రకారం .. . జిల్లా కలెక్టర్, లేని పక్షంలో ఆ ర్యాంకుకు తగ్గని అధికారికి మాత్రమే ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత ఉందని నవీన్ కుమార్ రెడ్డి పిటి,న్‌లో పేర్కొన్నారు. ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు నిర్వర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, సాధారణ పరిపాలన, దేవాదాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, టీటీడీ మేనేజ్‌మెంట్ కమిటీ, టీటీడీ ఇంఛార్జ్ ఈవో ధర్మారెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.ఈ పటిషన్‌పై ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి.
రక్షణ శాఖలో గ్రూప్ ఏ సర్వీసెస్ ఉద్యోగి ధర్మారెడ్డి
ధర్మారెడ్డి 1991లో ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఏ సర్వీసెస్ పోస్టులో యూపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యారు. ఆయన్ను డిప్యుటేషన్‌పై ఆంధ్రకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ 2019 జూలై 8న ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మే 14తో ఆ డిప్యుటేషన్ కాలపరిమితి ముగిసింది. అయితే పొడిగింపుతెచ్చుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్‌రెడ్డి బదిలీ కావడంతో.. టీటీడీ ఈవో పోస్టు ఖాళీ కావడంతో ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం మే 8న జీవో 813 జారీ చేయగా.. ఈ నియామకం నిబంధనలకు విరుద్ధం. ఐడీఈఎస్ అధికారి అయిన ధర్మారెడ్డికి జిల్లా కలెక్టర్ స్థాయి అర్హత లేదని పిటిషన్ వాదించారు.
గతంలో వైఎస్ హయాంలో టీటీడీలోకి.. ఇప్పుడు జగన్ హయాంలోనూ టీటీడీలో కీలక బాధ్యతలు
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ధర్మారెడ్డి డిప్యూటీ ఈవోగా పని చేశారు. అప్పట్లో కొన్ని వివాదాలు రావడంతో మళ్లీ రక్షణ శాఖలోకి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మళ్లీ ఆయనను ఏపీలోకి డిప్యూటేషన్ మీద తీసుకు వచ్చారు. టీటీడీ పదవి ఇచ్చారు. గత మూడున్నరేళ్లుగా ఆయన టీటీడీలోనే జేఈవోగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లెక్క ప్రకారం ఈవోగా ఐఏఎస్‌లు ఉంటారు. ఇప్పుడు హైకోర్టు ధర్మారెడ్డి నియామక పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.