AP BJP Amaravati : బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !
అమరావతి విషయంలో అమిత్ షా క్లారిటీ ఇవ్వడంతో ఏపీ బీజేపీ నేతలు పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ప్రకటించడంతో అమరావతి రైతులకు బలం వచ్చినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి అనూహ్యమైన మద్దతు లభించడం మనో ధైర్యం పెంచినట్లయింది. ఇప్పటి వరకూ ఏపీ బీజేపీ నేతలు ప్రకటనల్లో మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా పాదయాత్రలో సైతం పాల్గొని మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో అమరావతి రైతులకు మరింత మనోధైర్యం లభిస్తున్నట్లయింది.
Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?
ఇప్పటి వరకూ అమరావతికి మద్దతుపై ఏపీ బీజేపీ నేతల డైలమా !
భారతీయ జనతా పార్టీ నేతలు అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని పార్టీ పరంగా తీర్మానం చేశారు. కానీ నిర్ణయాలు తీసుకునే కీలక స్థానాల్లో ఉన్న కొంత మంది నేతలు రైతులకు నేరుగా మద్దతు ప్రకటించడానికి లేదా వారి పోరాటంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధపడలేదు. రైతులు ఎలాంటి కార్యక్రమాలు జరిపినా బీజేపీ ేతలు ఎవరూ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అదే సమయంలో కొంత మంది బీజేపీ నేతలు రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి రైతుల వస్త్రధారణపైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా సంబోధించడంతో ఓ టీవీ చానల్ చర్చలో ఆయనపై అమరావతి జేఏసీ నేత చెప్పుతో దాడి చేసిన ఘటన సంచలనం అయింది.
పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రత్యక్ష మద్దతుకు దూరంగా జనసేన !
అమరావతికి మద్దతుగా మాట్లాడిన కొంత మంది నేతల్ని మొదట్లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలతో చేసిన తీర్మానానికి ఏపీ బీజేపీ విధానానికి సంబంధం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన కూడా రైతులకు ప్రకటనల్లోనే మద్దతు పలికింది కానీ ప్రత్యక్షంగా పోరులో పాల్గొనలేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న షరతుతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని రైతులను కలిసినప్పుడు ఓ సారి పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే జనసేన కూడా ఇప్పటి వరకూ నేరుగా రైతులకు ప్రత్యక్షంగా మద్దతిస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇప్పుడు అమిత్ షా క్లారిటీ ఇవ్వడంతో వారంతా మద్దతుగా రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !
అమిత్ షా సూచనలతో పాదయాత్రలో పాల్గొననున్న బీజేపీ, జనసేన కూటమి !
ఏపీలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. అమరావతి రైతులకు బీజేపీ మద్దతు చాలా కీలకం. ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అమరావతిని కాపాడే స్టామినా ఒక్క కేంద్రంకే ఉంది. స్వయంగా హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతి రాజధాని అందరిదని చెప్పడంతో బీజేపీ నేతలు కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి ఇక అమరావతికే మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ కారణంగా అమరావతి ఉద్యమంలో విజయం సాధిస్తామని రైతులు మరింత నమ్మకం పెంచుకుంటున్నారు. అమిత్ షా టూర్ తర్వాత పాదయాత్రలో ఉన్న రైతులకు ఓ రకమైన భరోసా లభించినట్లయింది.
Watch Video : కోటి గెలుచుకున్న Raja Ravindra చెప్పిన ఆసక్తికర విషయాలు