AP Highcourt Capital Bills : జనవరి 28న రాజధాని పిటిషన్లపై పూర్తి స్థాయి వాదనలు.. విచారణ కొనసాగించాలని రైతుల విజ్ఞప్తి !
రాజధాని పిటిషన్లపై విచారణ జనవరి 28వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మూడు రాజధానుల బిల్లులు మళ్లీ తెస్తామని ప్రభుత్వం చెబుతున్నందున విచారణ కొనసాగించాలని రైతుల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.
మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ.. మళ్లీ బిల్లులు తెస్తామని చెబుతున్నందున విచారణ కొనసాగించాల్సిందేనని రైతుల తరపు లాయర్లు హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. రాజధానిపై పిటిషన్లపై విచారణ సోమవారం హైకోర్టులో జరిగింది. విచారణ ప్రారంభమైన తర్వాత రైతుల తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ ప్రభుత్వ వైఖరిని వివరించి... పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిందేననికోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేనన్నారు. రైతులకు సంబంధించి వాదనలు వినిపించిన లాయర్లు కూడా దాదాపుగా ఇదే కోరారు.
Also Read: ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ధర్నా.. అందరూ వెళ్లిపోవాలని డిమాండ్, ఎందుకంటే..
ప్రభుత్వం విచారణ జరుగుతున్న సమయంలోనే కన్ని సంస్థలను బయటకు తరలిస్తోందని రైతుల తరపున మరో న్యాయవాది మురళీధర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సెలక్ట్ కమిటీ ఆమోదం లేకుండానే బిల్లును ఆమోదించినట్లు పేర్కొన్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమని మరో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణ కొనసాగింపు... ఇతర అంశాలపై పది రోజుల్లో పూర్తి స్థాయి కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అదే సమయంలో పిటిషనర్ల తరపున లాయర్లు తమ అఫిడవిట్లను పది రోజుల్లో దాఖలుచేయాలని సూచించింది. తదుపరి విచారణ జనవరి ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల బిల్లు, అలాగే సీఆర్డీఏబిల్లును రద్దు చేయడంపై రైతులు పిటిషన్లు వేశారు. దీనిపైరోజు వారీ విచారణ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా బిల్లులు ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది.
Also Read: రాజ్ భవన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు... హాజరైన సీఎం జగన్ దంపతులు
వెంటనే అసెంబ్లీలో ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆ విషయాన్ని హైకోర్టుకు తెలియచేశారు. విచారణ ముగించాలని కోరారు. అయితే వైఎస్ఆర్‌సీపీ మంత్రులు, ఇతరులు మళ్లీ మూడు రాజధానులు తీసుకు వస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఓ అదనపు అఫిడవిట్‌లో మళ్లీ మూడు రాజధానులు తీసుకు వస్తామని కోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టులో పిటిషన్లపై విచారణ కొనసాగించాలన్న డిమాండ్‌ను రైతులు మళ్లీ వినిపిస్తున్నారు.
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?