Anandaiah Medicine: ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ధర్నా.. అందరూ వెళ్లిపోవాలని డిమాండ్, ఎందుకంటే..
పక్క రాష్ట్రాల నుంచి ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి జనం వస్తుండడం తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పంపిణీ చేసే ఆనందయ్య మందు విషయంలో గ్రామంలో ఉద్రిక్తత జరుగుతోంది. మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని గ్రామస్థులంతా కలిసి అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఒమిక్రాన్‌కు కూడా తాను మందు తయారు చేశానని ఆనందయ్య ప్రకటించడంతో ప్రజల తాకిడి ఎక్కువగా మారింది.
పక్క రాష్ట్రాల నుంచి ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి జనం వస్తుండడం తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు రోగులు అంబులెన్సుల్లో కూడా వచ్చి తీసుకు వెళ్తుండడంతో అంతమంది ఊళ్లోకి రావటంతో గ్రామస్తులకు కూడా కోవిడ్ సోకుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలీసులు ఆనందయ్యతో చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న పత్రాలను చూపించాలని ఆయన్ను కోరారు. అయితే, ఆనందయ్య మందుకు అనుమతులు లేవని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతంలో ఆనందయ్య వద్ద కరోనా మందు తీసుకువెళ్లటానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అప్పుడు, ఆ మందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే ఒమిక్రాన్ మందు కూడా అందులో భాగమేనని ఆనందయ్య చెబుతున్నారు. కానీ, గ్రామస్తులు అందుకు ససేమిరా అంటున్నారు.
22 రకాల దినుసులతో మందు తయారీ
శుక్రవారం ఆనందయ్య మాట్లాడుతూ సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు కూడా తయారు చేశామని అన్నారు. ఇది ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదన్నారు. ఒమిక్రాన్‌కు గురైన వారు మందు కోసం నేరుగా సంప్రదించొచ్చని, లేదా ఎవరినైనా పంపించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉన్న యూకే, యూఎస్‌ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని, త్వరలోనే బాటిల్స్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆనందయ్య వివరించారు.
Also Read:అఖిల్ 'బీస్ట్' లుక్.. ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్..
Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం
Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..
Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..