Janasena TDP : టీడీపీ - జనసేన పొత్తు ఖరారు - యుద్ధానికి సిద్ధమని పవన్ కల్యాణ్ ప్రకటన !
టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయింది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చంద్రబాబు, పవన్ ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. జగన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటే.. తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని.. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానన్నారు.
ఇవాళ ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైనది . వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయని.. ఇది మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ప్రకటించారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు రాజకీయనేత... జగన్ ఆర్థిక నేరస్థుడన్నారు. సైబరాబాద్ నిర్మించిన, హైటెక్ సిటీ సృష్టించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే తన ఆకాంక్ష అనతి.. వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందు ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. వైసీపీ పాలనతో మునిగిపోయామని.. అధికారులు జగన్ ను నమ్ముకుంటే.. కుక్కతోకను పట్టుకుని గోదారి ఈదినట్లేనని హెచ్చరించారు.
తాను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయని.. దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తిని తానేనన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని మోదీకి మద్దతు తెలిపిన సమయంలో నన్ను అందరూ తిట్టారన్నారు. కానీ ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గననని స్పష్టం చేశారు. ఏ రోజు వెళ్లినా కూడా మోదీ పిలిస్తేనే వెళ్లానని ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయననన్నారు. 2014లో బీజేపీ, టీడీపీ కు మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉందన్నారు. విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానన్నారు. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ చంద్రబాబు అనుభవం, అసమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
లక్షల కోట్ల సంపదను సృష్టించిన సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరో చేసిన తప్పును బ్యాంకు ఛైర్మన్ కు అంటగడతామా? అని ప్రశ్నించారు. డీజీపీ, సీఎస్ తో సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందన్నారు. చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలని.. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరన్నారు. మీకు సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది .. యుద్ధమే కావాలంటే యుద్దానికి సిద్ధమేనన్నారు. తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు 6 నెలలు సమయముందన్నారు. అక్రమంగా ఇసుక, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి - బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు.