Anaparthi News: వైసీపీ ఎమ్మెల్యే Vs టీడీపీ మాజీ ఎమ్మెల్యే - అనపర్తిలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
Ap News: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సవాల్, వైసీపీ ఎమ్మెల్యే ప్రతి సవాల్ తో తూ.గో జిల్లా అనపర్తిలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.
Tension in Anaparthi Due to Leaders Challenge: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి (Anaparthy) మండలంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి (Suryanarayana Reddy) అవినీతి, అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) సిద్ధమయ్యారు. 109 అంశాలపై చర్చకు సిద్ధమా అంటూ గురువారం సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే అవినీతి చేయలేదని చెప్తున్న ఎమ్మెల్యే ఎందుకు చర్చకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయలుదేరగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. వాహనం చుట్టూ చేరి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. మరోవైపు, టీడీపీ కార్యకర్తలు, నేతలు బారికేడ్లను దాటుకుంటూ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు - టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకోగా.. వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
పోలీసుల తీరుపై ఆగ్రహం
అటు, పోలీసుల తీరుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడతామని వచ్చి నిర్బందించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హైస్కూల్ ఆస్తిని కబ్జా చేశారని.. వైసీపీ నేతలు ఇళ్ల పట్టాల పేరుతో భూ సేకరణ చేసి రూ.15 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇన్ని అక్రమాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఏది ఏమైన చర్చకు వెళ్లి తీరుతామని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
సవాల్ ప్రతి సవాల్
వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రూ.500 కోట్ల అవినీతి చేశారని.. దీన్ని ఆధారాలతో సహా బయటపెడతానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి 'ఎప్పుడు వస్తావో టైం చెప్పి రావాలి' అంటూ ప్రతి సవాల్ చేశారు. అయితే, మార్చి 1న ఉదయం చర్చకు మీ ఇంటికి వస్తా అంటూ నల్లమిల్లి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అనపర్తిలో రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నుంచి నల్లమిల్లి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఆయన బయలుదేరుతుండగా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Also Read: YS Sinitha News: జగన్‌ను ఓడిస్తేనే నా తండ్రి హత్యకేసులో న్యాయం- వివేక కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు