YS Sunitha News: జగన్‌ను ఓడిస్తేనే నా తండ్రి హత్యకేసులో న్యాయం- వివేక కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు
Vivekananda Murder Case Updates: వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో తన తండ్రి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Sunitha Reddy Comments On Jagan: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను ఐదేళ్లుగా పోరాడుతున్న పట్టించుకోవడంలేదని, తనకు ప్రజా కోర్టులోనే తీర్పు కావాలని ఆమె కోరారు. నా తండ్రికి న్యాయం జరిగే ప్రజా తీర్పు కావాలని కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తన తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదని ఈ సందర్భంగా ఆమె వాపోయారు.
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని వాళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని ఆరోపించారు. జగన్ పై ఉన్న 11 కేసులు మాదిరిగా వివేక హత్య కేసు కాకూడదని ఆమె పేర్కొన్నారు. తన అన్న సీఎం జగన్ పాత్ర పైన విచారణ జరగాలని, నిర్దోషి అయితే వదిలేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. సాధారణంగా హత్య కేసుల్లో నాలుగైదు రోజుల్లోనే నిందితులు ఎవరన్నది తేలిపోతుందని, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఐదేళ్లయిన ఇంకా ఎందుకు తేలడం లేదంటూ ఆమె ప్రశ్నించారు.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి పోటీ చేశారని, ఆయన ఓడించాలని కొందరు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. సొంత వాళ్లే మోసం చేయడంతో వివేక ఓడిపోయారని, అయినా నిరాశ చెందకుండా మరింత యాక్టివ్ అయ్యారని సునీత రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ని అనగదొక్కలేక పోతున్నామని భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైందని, అప్పట్లో తమకు ఇదంతా అర్థం కాలేదని ఆమె వెల్లడించారు.
హత్య తర్వాత మార్చి 15, 2019 న మార్చురీ బయట అవినాష్ తన వద్దకు వచ్చారని, రాత్రి 11:30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్య ఉంటారని, మనం మాత్రం రియలైజ్ కాలేమని సునీతా రెడ్డి వాపోయారు. వివేకానంద రెడ్డి చంపిన వారిని వదిలిపెడితే ఏమి సందేశం వెళుతుందని, సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదని సునీతా రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ఉండకూడదని, వంచన, మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైకాపాకు ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ఆమె ప్రజలను కోరారు. అవినాష్, భాస్కర రెడ్డిని ఇంకా ఆయన రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలు పెరుగుతాయని సునీత రెడ్డి పేర్కొన్నారు. జగన్ పాత్ర పైన విచారణ చేయాలని మరోసారి ఆమె స్పష్టం చేశారు.
తానే సిబిఐకు ఫిర్యాదు చేశా
వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి సిబిఐ దర్యాప్తునకు వెళ్దామని జగన్ ను అడిగానని, అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. సిబిఐ కి వెళ్తే అవినాష్ బిజెపిలోకి వెళ్తారని జగన్ తనతో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ముఖంగా సునీత వెల్లడించారు. అందుకే తానే వెళ్లి సిబిఐకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సిబిఐ కి వెళ్ళిన తరువాత తనతోపాటు భర్తకు వేధింపులు పెరిగాయని, సిబిఐ పైన కేసులు పెట్టడం మొదలుపెట్టారని ఆరోపించారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతోపాటు కర్నూలు ఆసుపత్రి దగ్గర ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా సునీత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు తీర్పు తనకు కావాలన్నారు. వివేకానంద రెడ్డి కేసు విచారణలో ప్రతి ఒక్కరి సహకారం తనకు కావాలని, ఏపీ ప్రజల మద్దతు ప్రజా తీర్పు తనకు అనుకూలంగా అందించాలని ఆమె కోరారు. నేను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించే అడుగుతున్నారని, ఈ కేసు పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.