Margadarsi Case : మార్గదర్శికి ఇచ్చిన బహిరంగ నోటీసులపై హైకోర్టు స్టే - ఏపీ సర్కార్‌కు షాక్ !
మార్గదర్శికి ఇచ్చిన బహిరంగనోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆ నోటీసుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
Margadarsi Case : మార్గదర్శి చిట్స్ విషయంలో దూకుడుగా వెళ్తున్న ఏపీ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మార్గదర్శికి చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిట్స్ రిజిస్ట్రార్ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు పేర్కొంది.
చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. చందాదారుల వ్యాజ్యాలు, మార్గదర్శి వ్యాజ్యాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. కొద్ది రోజుల క్రితం మార్గదర్శికి వ్యతిరేకంగా దినపత్రికల్లో ఫుల్ పేజి పేపర్ యాడ్‌లు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఖాతాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శిని గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. కొద్దిరోజుల క్రితం మార్గదర్శి చిట్స్‌కి చెందిన కొన్ని గ్రూపులను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేని మార్గదర్శిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిట్లను నిలిపివేయటంపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శి కేసులను తెలంగాణ హైకోర్టులో వద్దని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ సర్కర్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు వారం రోజుల కిందట తిరస్కరించింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుక లేదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటీషన్లు కాలం చెల్లినవని చెప్పిన సుప్రీంకోర్టు ...మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలన్న జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే ఇచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వం పిటిషన్లపై విచారణ అవసరం లేదని.. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టు ముందు చెప్పండని ఏపీ న్యాయవాదులకు సూచించింది. తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చాక రావచ్చని సుప్రీంకోర్టు ఏపీ న్యాయవాదులకు స్పష్టం చేసింది.