TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం
పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై టీడీపీ పార్లమెంటరీ పార్టీలో చర్చ జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అంశాలపై చర్చ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన.. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఏపీలో వరదలు, పెట్రో ధరలు, ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లుల లాంటి కీలకాంశలపై చర్చించాలని.. నిర్ణయించారు. ఈ మేరకు 8 తీర్మానాలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదించింది.
పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని.. ఆ పార్టీ నిర్ణయించింది. పెట్రో ధరలపై కూడా ప్రస్తావించాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు అంశాలను సైతం పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. పంచాయతీ నిధుల దారి మళ్లింపు, ఉపాధి నిధుల అంశాలను చర్చకు తీసుకురావాలని పార్లమెంటరీ పార్టీ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనపై పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు చెప్పారు. వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడడం గురించి కూడా ప్రస్తావించాలన్నారు. అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయరాదని మంత్రులు ప్రకటన గురించి మాట్లాడాలన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు గురించి, ఉపాధి హామీ నిధులు మళ్లింపు, ఈఏపీ నిధులు దారి మళ్లింపులాంటి అంశాలను ప్రస్తావించాలని చంద్రబాబు చెప్పారు.