MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా
2024 Bishkek Riots: కిర్గిస్థాన్‌లోని తెలుగు విద్యార్థులతో ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి భరత్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు.
![MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా TDP MP Rammohan Naidu Zoom Call With Kyrgyzstan Telugu Students MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/fd1d22bcb7b00ff57bf44daebb8693f51716171183821798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kyrgyzstan Riots: కిర్గిస్థాన్ (Kyrgyzstan)లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న తెలుగు విద్యార్థులతో ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) మాట్లాడారు. విద్యార్థులందరూ మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ (Bishkek Riots) ప్రాంతంలో ఉంటున్న తెలుగు విద్యార్థులతో ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి భరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ కిలారు జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. వారి బోగోగులను తెలుసుకున్నారు.
విద్యార్థులు ధైర్యంగా, సహనంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇవ్వాలని సూచించారు. దేశ విదేశాంగ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చేవరకూ నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు చెప్పారు. అత్యవసరం అయితేనే విద్యార్థులు బయటకు రావాలని సూచించారు.
ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే?
కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి అంతుపట్టడం లేదు. మే 13న కిర్గిస్థాన్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలే ఇందుకు కారణమని స్థానిక మీడియా చెబుతోంది. కొంత మంది కిర్గిస్థాన్ విద్యార్థులు పాకిస్థాన్, ఈజిప్ట్‌కు చెందిన యువతులను వేధించడంతోనే ఘర్షణలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్, ఈజిప్ట్‌కి చెందిన విద్యార్థులు స్థానిక విద్యార్థులతో గొడవ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కిర్గిస్థాన్ విద్యార్థులు విదేశీ విద్యార్థులు ఉంటున్న హాస్టల్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లోనే ముగ్గురు చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి.
భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు
దాడులకు సంబంధించి ఇప్పటి వరకూ కిర్గిస్థాన్ నుంచి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. అంతా అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని కిర్గిస్థాన్ భద్రతా బలగాలు చెబుతున్నాయి. కానీ భారత్, పాకిస్థాన్ విద్యార్థుల మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఘర్షణల గురించి తెలుసుకున్న భారత్‌తో పాటు పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమయ్యాయి. భారత్ అక్కడి విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఎంబసీని సంప్రదించాలని వెల్లడించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడి పరిస్థితులపై స్పందించారు. భారతీయ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
పాకిస్థానీ విద్యార్థులపై దాడులు జరగడంతో దాయాది దేశం అలెర్ట్ అయింది. తమ దేశ విద్యార్థులున్న హాస్టల్స్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు బాధితులకు కచ్చితంగా సహకరిస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. దాడుల్లో ముగ్గురు పాకిస్థానీలు మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు. అయితే పాక్ ప్రభుత్వం వాదనలను కిర్గిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని వాదిస్తోంది. బిస్కెక్‌లోని మెడికల్ యూనివర్సిటీలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే అక్కడికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు భారత్ విద్యార్థులు ఎక్కువగా వెళ్తుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)