Governor Appointment: టీడీపీ నేతలకు నిరాశ, గవర్నర్ అపాయింట్‌మెంట్ రేపటికి వాయిదా
Governor Appointment: టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అపాయింట్ మెంట్ లభించలేదు.
Governor Appointment: టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అపాయింట్‌మెంట్ లభించలేదు. మొదట ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రామారావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్‌లు గవర్నర్‌ను కలిసి చంద్రబాబు అరెస్టు గురించి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. అయితే చివరి నిమిషంలో టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసే కార్యక్రమం ఆదివారం ఉదయం 9.30 గంటలకు వాయిదా పడినట్లు సమాచారం. రేపు ఎఫ్ఐఆర్‌లో పేరులేని వ్యక్తిని అరెస్టు చేశారని టీడీపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కొనసాగుతున్న చంద్రబాబు విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పోలీసులు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అధికారులు పేవర్ వర్క్ పనిని పూర్తి చేస్తున్నారు. అక్కడ చంద్రబాబును సుమారు గంటన్నర పాటు విచారించే అవకాశం ఉంది. చంద్రబాబు స్టేట్ మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబును వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లనున్నారు. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు.
సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు కుటుంబ సభ్యులు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులను SIT కార్యాలయంలోకి అనుమతించారు. సీఐడీ అధికారులు చంద్రబాబును చూసేందుకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, మరికొందరు కుటుంబసభ్యులను సిట్ ఆఫీసులోకి పంపించారు. నేటి ఉదయం నుంచి చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేతను కలిసేందుకు చంద్రబాబు కుటుంబసభ్యులను సిట్ కార్యాలయంలోకి అధికారులు అనుతించారు.
కానీ చంద్రబాబు వద్దకు కుటుంబసభ్యులను తీసుకెళ్లలేదు. చంద్రబాబు కుటుంబసభ్యులను అధికారులు 4వ అంతస్తులో కూర్చోబెట్టారు. చంద్రబాబు 5వ అంతస్తులో విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణ, బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిందని బాలయ్య ఆరోపించారు. తాను ఎలాగూ జైళ్లో ఉన్నానని, చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలని జగన్ తాపత్రయం అని, ఛార్జిషీటు లేకున్నా, కేసులో పేరు లేకున్నా కక్ష సాధింపు ధోరణితో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారని బాలకృష్ణ విమర్శించారు.
ఇన్వెస్టిగేషన్ అధికారికి చంద్రబాబు లేఖ
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేసు ఇన్వెస్టిగేషన్ అధికారికి లేఖ రాశారు. తన తరఫు న్యాయవాదులను కలిసే హక్కు తనకు ఉందన్నారు. కేసుపై న్యాయపరమైన అంశాలు చర్చించడానికి నలుగురు న్యాయవాదులు అవసరం ఉందన్నారు. దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం. లక్ష్మీ నారాయణ, జవ్వాజి శరత్ చంద్రలను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.
చంద్రబాబు లాయర్లను అనుమతించని పోలీసులు
ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు తరఫున వచ్చిన నలుగురు అడ్వకేట్లను పోలీసులు అనుమతించడం లేదు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై చంద్రబాబు తరఫు అడ్వకేట్లు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.