Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాతో 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో మొదలైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించారు.
ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పొత్తుల విషయంపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారని ఏపీలో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే ఉండటంతో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించడంతో పాటు పాత మిత్రులను తమతో కలిసిరావాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ పలుమార్లు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రం పెద్దలను కలుస్తుంటారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, విభజన సమస్యలు, రాజధాని, పోలవరం లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో పలుమార్లు ఢిల్లీలో భేటీ అయి జగన్ చర్చించారు. కానీ అధికారంలో లేని చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొలిటికల్ అజెండా కోసమేనని ప్రచారం జరుగుతోంది.
జనసేన పార్టీ ఇదివరకే వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దని చెబుతోంది. బీజేపీతో కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ ప్రకటనలు సైతం చేశారు. అయితే వీరికి మరింత బలం చేకూరాలంటే టీడీపీతో కలిసి రాజకీయ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏలో చేరకపోయినా వైఎస్ జగన్ కేంద్రం నిర్ణయానికి మద్దతు తెలుపుతుంటారు. అవసరమైతే వైఎస్సార్ సీపీ ఎన్డీఏ కూటమిలోకి వస్తుందని, టీడీపీకి మాత్రం ఛాన్స్ ఇవ్వవద్దని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కోరినట్లు వాదన సైతం వినిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్ అయితే 2014 కూటమి పదేళ్ల తరువాత మరోసారి ఏపీలో రిపీట్ కానుంది.
ఆజాది కా అమృత్ మహోత్సవ్ సమయంలో 2019 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీని చంద్రబాబు ఒకసారి కలిశారు. జీ20 సన్నాహక సదస్సు సందర్భంగానూ మరోసారి మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు చర్చించే అవకాశాలున్నాయి. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించిన విషయాలను బీజేపీ పెద్దలతో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. తన అనుభవం ఏపీలో ప్రభావం చూపుతుందని ప్రధానితో సైతం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై జనసేన, బీజేపీ ప్రకటనలు చేస్తున్న క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఎన్డీఏ నుంచి వైదొలిగిన సమయంలో చంద్రబాబుకు అమిత్ షా లేఖ..
గతంలో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన సమయంలో చంద్రబాబుకు అమిత్ షా లేఖ రాశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం, ఏకపక్ష నిర్ణయం అన్నారు. అభివృద్ధికి బదులుగా రాజకీయ అంశాలతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని చంద్రబాబుకు రాసిన లేఖలో షా పేర్కొన్నారు.