Tadikonda Mla Office Attack : తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీస్ పై దాడి, ఫ్లెక్సీలు చించేసిన వైసీపీ కార్యకర్తలు!
Tadikonda Mla Office Attack : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడిచేశాయి. అలాగే మేకపాటిని సస్పెండ్ చేయడంతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
Tadikonda Mla Office Attack : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలు చించివేశారు. ఉండవల్లి శ్రీదేవికు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది అధిష్ఠానం. దీంతో వైసీపీ శ్రేణులు ఆమె ఆఫీస్ దాడి చేసి విధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో శ్రీదేవి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను అడ్డుకోబోయిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తమను అడ్డుకుంటే సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి పంపేప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవితో నాలుగు సంవత్సరాలు ప్రయాణం చేశామని, ఆమె గెలుపు కోసం కష్టబడ్డామన్నారు. టికెట్ ఇచ్చిన పార్టీకే నమ్మకద్రోహం చేశారని ఆమెపై విమర్శలు చేశారు వైసీపీ కార్యకర్తలు.
నలుగురు ఎమ్మెల్యేలపై వేటు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామని, క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా దర్యాప్తు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సజ్జల ఇలా ప్రకటించగానే ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు.
ఉదయగిరిలో సంబరాలు
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సొంతపార్టీలోనే ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయడంతో స్థానిక నేతలు సంబరాలు చేసుకున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తరిమేసి మంచి పని చేశారంటూ వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వింజమూరులో జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. మేకపాటి పార్టీకి చేటు అని, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం సరైన చర్యేనంటున్నారు వైసీపీ నేతలు.
క్రాస్ ఓటింగ్ గుర్తించామన్న సజ్జల
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారాణంగా నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాము అంతర్గతంగా విచారణ జరిపి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశామని గుర్తించామన్నారు. ఆ నలుగురు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ నలుగురిలో ఇద్దరిని వైసీపీ హైకమాండ్ ముందుగానే పరిగణనలోకి తీసుకోలేదు. కోటంరెడ్డి, ఆనం ఇద్దరికీ వైసీపీ హైకమాండ్ ఎవరికి ఓటేయాలో చెప్పలేదు. అయితే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం క్యాంపులో ఓట్లు ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయించి..ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించారు. చివరికి వారు టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్లుగా వైసీపీ హైమకమాండ్ గుర్తించింది. తాము ప్రత్యేకంగా ఓ కోడ్ పెట్టుకున్నామని ఆ కోడ్ ఆధారంగా గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొన్నారని సజ్జల ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ. పదిహేను నుంచి రూ. ఇరవై కోట్ల వరకూ డబ్బులు ఇచ్చారన్నారు.