Sitrang Cyclone : ఏపీకి పొంచి ఉన్న సూపర్ సైక్లోన్ ముప్పు, సిత్రాంగ్ తుపానుగా నామకరణం!
Sitrang Cyclone : విశాఖకు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 20 తర్వాత తుపాన్ ఏపీ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు.
Sitrang Cyclone : విశాఖకు మరో సూపర్ సైక్లోన్ ప్రమాదం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత భారీ తుపాన్ ఏపీ వైపు దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 18న అండమాన్ వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది 20వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతంగా విస్తరించనుంది. అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ దిశగా కదిలే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ సమయంలో తీవ్ర తుపానుగా మారేందుకు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుపాను ఏర్పడితే దానికి "చిత్రాంగ్ / సిత్రాంగ్ " అని పేరు పెట్టనున్నారు. ఈ సూపర్ సైక్లోన్ ప్రభావం ఏపీ, ఒడిశా, బెంగాల్ ల పై అధికంగా పడే అవకాశం ఉంటుంది అంటున్నారు . కొన్ని రోజులుగా ఏపీలో ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖకు తుపాను ముప్పు
తూర్పు తీరంలో ఎన్ని తుపానులు వచ్చినా విశాఖ వద్ద తీరం దాటేవి కావు. భౌగోళికంగా విశాఖ సముద్రతీరంలోని ఒక వంపు లాంటి ప్రాంతం వద్ద నగరం నిర్మితమై ఉండడం, డాల్ఫీన్ నోస్ లాంటి సహజసిద్దమైన కొండలు తుపానులను విశాఖ వద్ద తీరం దాటకుండా సహజ రక్షణ కల్పించేవి. అయితే కొన్నేళ్లుగా వాతావరణంలో జరుగుతున్న మార్పులు , ప్రకృతిని అభివృద్ధి పేరుతో చేస్తున్న నష్టం వల్ల విశాఖ తీరంపై ప్రభావం పడుతుంది. ఎనిమిదేళ్ల క్రితం హుద్ హుద్ తుపాను సృష్టించిన విలయం ఇంకా వైజాగ్ వాసులకు పీడకల గానే ఉంది. ఆ తరువాత నుంచి తుుపాను అంటేనే వైజాగ్ వాసులకు గుండె దడ పట్టుకుంటుంది. మరో సూపర్ సైక్లోన్ త్వరలో ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అందించిన అంచనాలతో మళ్లీ అందరి దృష్టి వైజాగ్ పై పడింది. అయితే ఈ తుపాను వల్ల వైజాగ్ మాత్రమే కాకుండా ఏపీలోని ఇతర జిల్లాలు, ప్రాంతాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం మరో రెండు రోజులు పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో భారీ వర్షాలు
ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షం, వరదలతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విశాఖకు మరో తుపాను ముప్పు ఉండే అవకాశం ఉందని అలర్ట్ గా ఉండాలని సూచిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికీ భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మన్యం ప్రాంతాల్లో నడవడానికి కూడా వీళ్లేని పరిస్థితులు ఉన్నాయి.