Apollo News: విద్యార్థుల ఆరోగ్య భద్రతే అపోలో తొలి ప్రాధాన్యమన్న యాజమాన్యం
ఫుడ్ పాయిజన్ కారణంగా యూనివర్సిటీ విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడంపై సంస్థ యాజమాన్యం స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Apollo Food Poision: విద్యార్థుల ఆరోగ్య భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని అపోలో యాజమాన్యం పేర్కొంది. చిత్తూరు అపోలో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యం ఒక ప్రకటనను విడుదల చేసింది. యూనివర్సిటీ డీన్ ఆల్ఫ్రెడ్ జె అగస్టీన్ విద్యార్థులను, బాధితులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలు కావడం మమల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నాం. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చాలా మంది ఇప్పటికే కోలుకుని ఇంటికి కూడా చేరుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే వరకు పూర్తి బాధ్యత అపోలో యాజమాన్యమే చూసుకుంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థుల భోజనం విషయంలోనూ మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంది.
ఏ సాయం కావాలన్నా సంప్రదించాలంటూ డీన్ అగస్టీన్ లేఖ
ఆహార భద్రతా ప్రొటోకాల్, ప్రమాణాలను మెరుగు పరుస్తాం. సురక్షితమైన వాతావరణంలో బలమైన ఆహారాన్నిఅందించడానికి ఇకపై ప్రతిరోజూ ఫుడ్ తనిఖీలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఈ విషయంలో అపోలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడే ప్రసక్తే ఉండదు. ఏ విధమైన సహాయం అవసరమైనా నిర్మొహమాటంగా మమ్మల్ని సంప్రదించ్చు. అంటూ యూనివర్సిటీ డీన్ ఆల్ఫ్రెడ్ జె అగస్టీన్ పేరిట ఈ లేఖను విడుదల చేసింది అపోలో యాజమాన్యం.
300 మందికి పైగా అస్వస్థత
నాలుగు రోజుల క్రితం చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ లో జరిగిన ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కలుషితాహారం తిన్న కారణంగా వాంతులు, విరేచనాలు డయేరియా బారిన పడినట్లు డాక్టర్లు గుర్తించారు. విద్యార్థులను సమీపంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కొంతమందికి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కాలేజీలో ఎంబీబీఎస్, బీఎస్సీ, ఏహెచ్‌ఎస్, ఫిజియోథెరపీ, ఎంఎస్‌సీ, బీటెక్, ఎంబీఏ కోర్సుల్లో దాదాపు 900 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు చదువుతున్నారు. వీరంతా యూనివర్సిటీ హాస్టల్లోనే ఉంటున్నారు. చిత్తూరు పట్టణానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలోని మురకంబట్టు ప్రాంతంలో ఈ అపోలో మెడికల్ కాలేజీ ఉంది. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు వంకాయ, సాంబారుతో భోజనం తిన్నారు. అదే రోజు రాత్రి నుంచే కొందరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. రాత్రి సాంబారు,దోశ తిన్నవారికి బుధవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో తీవ్రమైన కడుపునొప్పి,వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ఉదయాన్నే టిపిన్‌లోకి మిరపకాయ బజ్జీ, ఉగ్నాని, ఉప్మా తిన్నవారు ఇదే విధంగా ఆస్పత్రి పాలయ్యారు.
దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Also Read: Blue Ribbon Overseas: అపోలో మెడ్‌స్కిల్స్‌తో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఒప్పందం